హ్యాండ్ పార్టీ హ్యాండ్ ఇచ్చినట్టెనా? కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి దేవేందర్ ఆర్టికల్!

అమలుకు నోచుకోని విద్యార్థి యువ వికాస పథకం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు పూర్తి చేసుకుంది. అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు.. గత ప్రభుత్వంపై విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ అందిపుచ్చుకొని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలో ఉన్నటువంటి స్కీములను, అలాగే ఆరు గ్యారంటీలను వంద రోజులలో అమలు చేస్తానని వాగ్దానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు ఆరు గారెంటీలను పూర్తిగా అమలుకు నోచుకోలేదు.

6 గ్యారంటీలలో ఉన్నటువంటి 5వ గ్యారెంటీ విద్యార్థి యువ వికాసం గ్యారంటీతో విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని. అలాగే ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు యువ వికాసం స్కీమ్ గురించి ఒక స్పష్టత ఇవ్వకుండా దాటేసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే విద్యార్థి యువ వికాసం అమలు చేస్తానని కల్లిబొల్లి మాటలు చెప్పినా రేవంత్ ప్రభుత్వం ఇంతవరకు విద్యార్థి యువ వికాసం గురించి గానీ ఈ యొక్క పథకం గురించి గానీ ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వకుండా ఇతర పార్టీలో ఉన్నటువంటి లీడర్లను తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా బిజీ అయిపోయారు మన ముఖ్యమంత్రివర్యులు.

యువ వికాసంపై విద్యార్థుల్లో తలెత్తుతున్న పలు ప్రశ్నలు

యువ వికాస పథకం ద్వారా ఫీజులు, కోచింగ్ ఫీజు చెల్లింపుల కోసం ఐదు లక్షల రూపాయలు గ్యారెంటీ కార్డు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం. రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, వైద్య, వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా దాదాపు పూర్తి కావస్తోంది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులు బయటకు రాబోతున్నారు. కానీ ఇంతవరకు కూడా విద్యార్థులకు ఉపకార వేతనాలు అమలుకు నోచుకోలేదు. 2021-2024 వరకు దాదాపుగా 7500 కోట్ల ఫీజు నెంబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో సర్టిఫికెట్లు తీసుకుందామని కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతుంది.

ఫీజు చెల్లిస్తేనే మీ సర్టిఫికెట్స్ ఇస్తామని కళాశాలల యాజమాన్యాలు ఖరాఖండిగా చెబుతున్నాయి. అయినప్పటకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాక అయోమయస్థితిలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థి యువ వికాసంలో జత చేస్తారా లేక విడిగానే ఇస్తారా.. అనే డైలమాలో విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రభుత్వమైనా మేల్కొని తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. విద్యార్థి యువవికాసం కార్డ్ ఎలా ఇస్తారు అనే దానిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ ఈ కార్డుతో విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్లు తీస్తే వడ్డీ ఎవరు భరిస్తారన్నది ప్రశ్నగా మారింది.

యువ వికాసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా అమలు చేస్తారా? అంతేకాకుండా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పట్టించుకోకుండా విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరుగుతా ఉంది కనీసం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేనటువంటి దౌర్భాగ్యమైన స్థితికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు కావస్తున్నా విద్యారంగం వైపు కన్నెత్తి కూడా చూడలేని స్థితి రాష్ట్రంలో ఏర్పడింది. విద్యారంగ సమస్యలు అలాగే నిరుద్యోగ సమస్యలు విన్నవించుకుందామని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు. కళాశాల యజమానులు వారి బాధలు చెప్పుకుందామంటే ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడంతో.. ఎవరికి తెలియజేయాలో తెలియని అయోమయ స్థితి రాష్ట్రంలో నెలకొంది.

ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అమలు సాధ్యమేనా?

ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు జరిగేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని యువ వికాసం స్కీమ్ లో భాగంగా చెప్పడం జరిగింది కానీ అది ఏ మేరకు అమలవుతుందనేదే అందరి మదిలో నెలకొన్నటువంటి ప్రశ్న? గత ప్రభుత్వంలో పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకం మన ఊరు మనబడి రాష్ట్రంలో 26, 065 ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పించాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇందుకోసం గత ప్రభుత్వం బడ్జెట్లో 7289 కోట్ల రూపాయలు కూడా కేటాయించింది కానీ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మన ఊరు మనబడి కార్యక్రమం పూర్తి కాలేదు. రాష్ట్రంలో మొత్తం 605 మండలాలు ఉన్నాయి. ఈ 605 మండలాలలో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తుందా లేదా అనే ఒక పెద్ద ప్రశ్న ఏర్పడింది. ఒకవేళ నూతన పాఠశాలలను ప్రారంభిస్తారా లేక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభిస్తారా ఒకవేళ ప్రారంభిస్తే దానికి తగ్గట్టు ఉపాధ్యాయుల నియామకం ఏ మేరకు చేపడుతుంది. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెను సవాలు గానే మారనుందా?

దేవేందర్ ముంజంపల్లి
జర్నలిజం పరిశోధక విద్యార్థి
కాకతీయ యూనివర్సిటీ
8978458611

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *