పల్లెల్లో హోలీ ముందు జాజిరి కోలాహలం
— ‘జాజిరి’ ఆట క్రమక్రమంగా తగ్గిపోతోంది…!
— పాడే పాటలు ఆడిన ఆటలు గుర్తున్నాయా…?
— తేలికైన పదాల్లో గొప్ప సందేశం.
— హోలీ వచ్చిందంటే చాలు పది రోజుల ముందు నుండే సందడి నెలకొంటది.
— నేటి తరానికి జాజిరి ఆట,పాట ఎంతమందికి తెలుసు…?

పండుగ ఏదైనా పల్లెల్లో ఎంతో ప్రత్యేకంగా జరుపుకొంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు తమదైన సందడితో ఆ పండుగకు మరింత వన్నెతెస్తారు. అసలే పల్లె పదాలతో సాహిత్య పరిమళాలు కొత్త గుబాళింపు వెదజల్లే పల్లెల్లో ఆ సందడి మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ‘జాజిరి’ ఆట మెల్లగా తగ్గిపోతోంది.
ఆలస్యంగా వచ్చిన సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక మార్పుల కారణంగా పండుగను జరుపుకునే ఈ సంప్రదాయ పద్ధతి క్రమక్రమంగా తగ్గిపోతోంది.
పాల్గుణ మాసంలో వచ్చే రంగుల పండుగ హోలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండుగ సమయంలో చిన్నారుల జాజిరి పాటలు పల్లెల్లో ఏరులైపారుతాయి. కాముని పున్నమిని పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు గ్రామాల్లో జాజిరి ఆడటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. చిన్నారులు, యువకులు చిన్నచిన్న కర్రలు పట్టుకొని కోలాటం ఆడుతూ, పాటలు పాడుతూ వీధుల్లో ఉత్సాహం నింపుతారు. ఇంటింటికీ తిరుగుతూ కాముని ఆటలు ఆడుతారు. నిండుచందురుడి వెన్నెల వెలుగుల్లో చిన్నారులు పాడే పాటలు పల్లెలకు కొత్త అందాన్ని తీసుకొస్తాయి. అవి అందర్నీ కవ్విస్తాయి. నవ్విస్తాయి. చిన్నారులు, యువకులను ఉర్రూతలూగిస్తాయి. అలాంటిది ‘జాజిరి’ ఆట క్రమక్రమంగా తగ్గిపోతోంది ఆలస్యంగా వచ్చిన సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక మార్పుల కారణంగా పండుగను జరుపుకునే ఈ సంప్రదాయ పద్ధతి నెమ్మదిగా తగ్గిపోతోంది.
ఆ ‘ జాజిరి ‘ పాటల్లో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అంతులేని ఆనందం కూడా ఉంటుంది. అంతకుమించి లోతైన అర్థం ఆ జాజిరి పాటల్లో ఉంటుంది. తేలికైన పదాల్లో గొప్ప సందేశం ఇవ్వడం, ఆ అర్థాన్ని సున్నితమైన హాస్యంతో మిళితం చేసి చెప్పడం జాజిరి పాటలకే సొంతం. జాజిరి పాటలు పాడుతూ ఇండ్ల ముందుకు వచ్చే చిన్నారులకు అమ్మలక్కలు తమకు తోచిన కానుకలు ఇచ్చి పంపిస్తారు. సాధారణంగా తమకు పండిన పంట ఉత్పత్తులతో పాటు డబ్బులు కానుకలుగా ఇస్తారు. ఇలా తొమ్మిది రాత్రులు ఆడుకొని చివరి రోజు కాముడిదహనం చేస్తారు. కోలాటానికి ఉపయోగించిన కర్రలను మంటల్లో కాల్చుతారు. మరుసటి రోజు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను సంబురంగా జరుపుకొంటారు. రంగుల్లో తడిసి ముద్దయ్యాక స్నేహితులంతా కలిసి ఊరి చివరన ఉన్న బావులు, కుంటల వద్దకు వెళ్లి ఈత కొడుతూ కేరింతలు పెడతారు.

జాజిరి పాటల్లో పురాణ ఇతిహాసాలకు సంబంధించిన పాటలతో పాటు వ్యవసాయ, శృంగార సంబంధ అంశాలు ఎక్కువగా ఉంటాయి. కోలలు, డప్పులు, చప్పుళ్లకు అనుగుణంగా, లయబద్ధంగా పాటలు ఉంటాయి. టీవీలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల రాకతో పాత సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో పుస్తకాలతో కుస్తీపడుతూ మార్కుల వేటలో జీవన యుద్ధం చేస్తున్న నేటితరం కోసం సామెతలు, పొడుపు కథలతో జానపద సాహిత్యానికి వెలికట్టలేని సంపదగా ఉన్న జాజిరి పాటల్లో మచ్చుకు కొన్ని..
— ‘ జాజిరి పాట ‘
రింగురింగు బిళ్లా..రూపాయి దండా/
దండకాదురో దామెర మొగ్గ
మొగ్గ కాదురో మోదుగ నీడ/ నీడ కాదురో నిమ్మల బావి
బావి కాదురో బసంత కూర/ కూర కాదురో గుమ్మడి పండు
పండుకాదురో పాపర మీసం/మీసం కాదురో మిరియాల పొడి
పొడి కాదురో పొరిమెల కట్ట/ కట్ట కాదురో చీపురు కట్ట
కట్ట తీసి నీ నెత్తిన కొట్టా..
ఈరన్న బల్లికోడె..జామ చెట్ల పండుకునే..!
చిన్ని పాప తేలు కుట్టేమందు తేరా మామ కొడుకా..!
అన్ని ఊర్లు తిరిగిన కానీ హనుమకొండ తిరుగలేదు
హనుమకొండ కర్రె కుక్క వాగులదాక తరుముకొచ్చె..!
కోతి పుట్టుడెందుకు-కొమ్మ లెక్కటందుకు
కొమ్మలెక్కుడెందుకు-నార చీరటందుకు
నార చీరుడెందుకు-రథం కట్టెటందుకు
రథం కట్టుడెందుకు-రాముడు ఎక్కేటందుకు
రాముడు ఎక్కేదెందుకు-వానలు పడేటందుకు
వానలు పడుడెందుకు-బువ్వతినేటందుకు
బువ్వ తినుడెందుకు-బుద్ధి నేర్చేటందుకు
బుద్ధి నేర్చుడెందుకు-భూమిలో పోయేటందుకు…
ఇలా జాజరి పాటలతో పల్లెటూర్లలో చిన్నారులు ఆడుతూ పాడుతూ సందడి చేయడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్నది.

బూరం ప్రశాంత్.
సీనియర్ జర్నలిస్ట్.