ప్రపంచ శాంతికి బుద్ధ, గురునానక్, వివేకానందుల బోధనలే మార్గదర్శకం
సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్
న్యూ ఢిల్లీ, మార్చి 09:
నేటి ఆధునిక కాలంలో భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి శాంతి మరియు సామాజిక సమానత్వం చేకూరాలంటే గౌతమబుద్ధుడు,గురు నానక్ దేవ్ మరియు స్వామి వివేకానంద వంటి మహనీయుల బోధనలు అత్యంత ఆవశ్యకమని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (IGNOU) ఇటీవల ఇంగ్లీష్ మరియు పంజాబీ భాషల్లో విడుదలైన “Icons for Equality: Buddha, Guru Nanak Dev & Swamy Vivekananda” అనే పుస్తకంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ముగ్గురు మహనీయులు వేర్వేరు కాలాల్లో జన్మించినప్పటికీ వారి లక్ష్యం మాత్రం ఒక్కటేనని అన్నారు. వారి బోధనలు భారతీయ సమాజంలో సామాజిక సమానత్వం తీసుకురావడంలో “త్రివేణి సంగమం” లాంటివని ఆయన అభివర్ణించారు.
ప్రస్తుతం అశాంతితో రగులుతున్న ప్రపంచానికి వీరి శాంతి సందేశాలు దిక్సూచిలా మార్గనిర్దేశం చేస్తాయని చర్చలో పాల్గొన్న మేధావులు అభిప్రాయపడ్డారు. సామాజిక వివక్షను తొలగించి ఐక్యతను చాటడంలో ఈ పుస్తకంలోని అంశాలు నేటి పరిశోధక విద్యార్థులకు మరియు యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయని వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇగ్నోటా అధ్యక్షులు ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ గుర్మీత్ కౌర్ పాల్గొని పుస్తక ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఇగ్నోటా జాయింట్ సెక్రటరీ డాక్టర్ కొండే లింగస్వామి, కార్యవర్గ సభ్యులు డాక్టర్ వీరమల్లు శ్రీశైలం, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సీమా రాణి, సోషల్ వర్క్ ఫ్యాకల్టీ డాక్టర్ బినోద్ కుమార్, డాక్టర్ అశోక్, డాక్టర్ శ్రవణ్ తదితరులు హాజరయ్యారు.
అలాగే 30 మందికి పైగా బోధనా సిబ్బంది, పరిశోధక విద్యార్థులు వినోద్ హిందుస్తానీ, కత్తుల ఉపేందర్ తదితరులు పాల్గొని చర్చను విజయవంతం చేశారు.
