సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాలకు శ్రీకారం
పద్మశ్రీ డా. గరికిపాటి నర్సింహారావు ముఖ్య అతిథిగా రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవం
హైదరాబాద్‌లో ఘనంగా సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ ప్రవచనకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు.

2026 ఫిబ్రవరి 22 ఆదివారం నాడు హైదరాబాద్‌లోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజ్ సర్దార్ పటేల్ హాల్‌లో రాష్ట్ర స్థాయిలో ఈ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంత్ రవిదాస్ చిత్రపటాలను ఆవిష్కరించి, వారి జీవిత చరిత్రతో కూడిన పుస్తకాన్ని విడుదల చేశారు.
రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 150 కుటుంబాలు, 400 మంది పాల్గొన్నారు. మోచి (చర్మకారులు) బంధువులు 100 మంది హాజరయ్యారు. 10 జిల్లాల నుంచి కార్యకర్తలు పాల్గొనగా, సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర సమితి మరియు ఆయాం ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

గరికిపాటి గారు ప్రసంగంలోని ముఖ్యాంశాలు
సంత్ రవిదాస్ మహారాజ్ జీవితం, భక్తి, సామాజిక సమరసతపై గరికిపాటి గారు పలు ప్రేరణాత్మక విషయాలను వెల్లడించారు:
- చర్మకార వృత్తిని నిబద్ధతతో ఆచరిస్తూనే పరమాత్మ నామస్మరణలో లీనమైన మహనీయుడు.
- శైవ–వైష్ణవ భేదాలు లేకుండా అందరిలోనూ భగవంతుని దర్శించిన మహాత్ముడు.
- రెండు జతల పాదరక్షలు తయారు చేసి, ఒక జతను సాధువులకు దానం చేసి, మరొక జతను జీవనోపాధికి వినియోగించిన త్యాగమూర్తి.
- వేద ధర్మాన్ని అనుసరిస్తూ, భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆధ్యాత్మిక విప్లవకారుడు.
- భక్తి కవి కబీర్ తో సమకాలీకుడిగా భక్తి సందేశాన్ని వ్యాప్తి చేశారు.
- గురు నానక్ సమకాలీకుడిగా భావించబడే సంత్ రవిదాస్ రచనలు సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ సాహిబ్ లో 40కు పైగా పద్యాలుగా పొందుపరచబడ్డాయి.
- “కులం కన్న గుణం మిన్న” అనే సందేశంతో వివక్షలేని సమాజ నిర్మాణానికి కృషి చేసిన సంస్కర్త.
- కృష్ణభక్తురాలు మీరాబాయి సంత్ రవిదాస్‌ను గురువుగా భావించి సేవించింది.
- కుటుంబాల్లో పరస్పర ప్రేమ, అనురాగాలతో జీవించాల్సిన అవసరాన్ని వివరించారు.
- నేటికీ కుల వివక్ష కొనసాగడం దురదృష్టకరమని, సంత్ రవిదాస్ బోధనలు సమరస్య సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

