ఉగాది – తెలుగు నూతన సంవత్సరం
హిందూ ధర్మంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ సృష్టిని భగవంతుడు చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి రోజున ప్రారంభించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన్ని మొదట యుగాది అని పిలిచేవారు. కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. సృష్టి ప్రారంభమైన రోజు కావడంతో ఉగాది మానవులందరికీ అత్యంత ముఖ్యమైన పండుగగా భావించబడుతుంది.

భారతదేశంలో ఉగాది
భారతదేశంలో ఉగాదిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు.
- కర్ణాటకలో – యుగాది
- మహారాష్ట్ర, గోవాలో – గుడి పడ్వా
- గుజరాత్లో – వైశాఖి
ఈ విధంగా భిన్న పేర్లతో అయినా ఒకే భావనతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు.
శాస్త్రీయ మరియు ఖగోళ ప్రాముఖ్యత
ఉగాది రోజు నుండే చంద్రుని కక్షలో మార్పులు, అలాగే సూర్యుడు భూమధ్యరేఖను దాటే ఖగోళ పరిణామాలు ప్రారంభమవుతాయి. అందువల్ల శాస్త్రీయంగా కూడా ఇది నూతన సంవత్సర ప్రారంభానికి సంకేతంగా భావించబడుతుంది.
ఖగోళ మార్పులతో పాటు ఋతువుల మార్పు కూడా ఈ సమయంలోనే ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రకృతికి, జీవకోటికి ఉగాదియే నిజమైన నూతన సంవత్సరంగా భావిస్తారు.
ప్రకృతిలో మార్పులు
హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులో ఉగాది ప్రకృతి ఆధారంగా జరుపుకునే ప్రధాన పండుగ.
ఈ సమయంలో:
- చలికాలం ముగిసి ఎండాకాలం ప్రారంభమవుతుంది
- వసంత ఋతువు మొదలవుతుంది
- చెట్లు పాత ఆకులు వదిలి కొత్త చిగుర్లు వేస్తాయి
- మామిడి చిగుళ్లు, వేపపువ్వులు, గోగిపూలు ప్రకృతిని అందంగా అలంకరిస్తాయి
ప్రకృతి అంతా నూతన పెళ్లికూతురిలా ముస్తాబవుతుంది. పక్షులు, జంతువులు కూడా కొత్త ఉత్సాహంతో కదలాడుతాయి. కోకిలల కుహుకుహూ ధ్వనులతో ప్రకృతి ఆనందభరితంగా మారుతుంది. ఈ మార్పులు మానవులకు కూడా నూతన ఉత్తేజాన్ని అందిస్తాయి.
నిజమైన నూతన సంవత్సరం
ప్రపంచం మొత్తం జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకుంటుంది. అయితే ఆ రోజున ప్రకృతిలో లేదా ఖగోళంలో పెద్ద మార్పులు ఉండవు. కేవలం క్యాలెండర్లో తేదీ మాత్రమే మారుతుంది.
కానీ ఉగాది నుండి ఖగోళం, ప్రకృతి, వాతావరణం అన్నిటిలోనూ స్పష్టమైన మార్పులు ప్రారంభమవుతాయి. అందువల్ల ఉగాదినే అసలైన నూతన సంవత్సరంగా చెప్పవచ్చు.
తెలుగు నూతన సంవత్సరం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ఉగాది జరుపుకుంటారు. ఇదే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం.
ఆంగ్ల సంవత్సరాలకు పేర్లు ఉండవు. కానీ తెలుగులో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక పేరు ఉంటుంది.
2026 సంవత్సర ఉగాది నూతన సంవత్సర పేరు – శ్రీ పరాభవ నామ సంవత్సరం.
ఈ సంవత్సరం ఉగాది
స్వస్తిశ్రీ చంద్రమాన చైత్రమాసం పాడ్యమి తిథి
2026 మార్చి 19, గురువారం న వస్తుంది.
శాలివాహన శకం ప్రారంభం
శాతవాహన వంశానికి చెందిన రాజు శాలివాహనుడు (గౌతమీపుత్ర శాతకర్ణి) క్రీస్తుశకం 78 సంవత్సరంలో ఉగాది రోజున పట్టాభిషేకం పొందాడు. అందుకే ఆ రోజునుండే శాలివాహన శకం ప్రారంభమైంది.
ఉగాది ఆచారాలు
ఉగాది రోజు ప్రజలు తెల్లవారుజామున లేచి:
- తలంటు స్నానం చేస్తారు
- కొత్త బట్టలు ధరిస్తారు
- దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు
- పంచాంగ శ్రవణం వింటారు
పంచాంగ శ్రవణం
పంచాంగ శ్రవణంలో కొత్త సంవత్సరానికి సంబంధించిన విషయాలను వివరిస్తారు.
ఉదాహరణకు:
- గ్రహస్థితులు
- రాశి ఫలితాలు
- వర్షపాతం
- పంటల పరిస్థితి
- ఆర్థిక వ్యవహారాలు
ఇవి తెలుసుకోవడం ద్వారా ప్రజలు కొత్త సంవత్సరానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు.
ఉగాది పచ్చడి
పంచాంగ శ్రవణం అనంతరం ఉగాది పచ్చడి తీసుకుంటారు. ఇది ఆరు రుచుల సమ్మేళనం.
ఆరు రుచులు జీవితంలోని సుఖదుఃఖాలకు సంకేతం.ఈ పచ్చడి మనిషి శరీరాన్ని ప్రకృతి మార్పులకు అనుగుణంగా సిద్ధం చేస్తుంది.
ధర్మ ధ్వజం
ఉగాది రోజున ఇంటిపై ధర్మ ధ్వజం ఎగరవేయడం కూడా ఒక పురాతన ఆచారం. ఇది ధర్మం, శుభం, విజయానికి సంకేతంగా భావిస్తారు.
శుభాకాంక్షలు
ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎవరికీ పరాభవాలు ఎదురుకాకుండా, అందరూ జీవితంలో విజయాలను సాధించి, తమ లక్ష్యాలను చేరుకోవాలని సృష్టికర్తను ప్రార్థిస్తూ అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
కత్తి శ్రీకాంత్
ప్రభుత్వ ఉపాధ్యాయులు
కరీంనగర్
