రంగం సినిమా-కేజ్రివాల్ నిజస్వరూపం గురించి..కొట్టె మురళీ కృష్ణ గారి ఆర్టికల్ వివరంగా..(Kejriwal -Rangam Movie-Kotte Murali Krishna Editorial Story)

చలన చిత్రంలో పాత్రలు సంఘటనలు జరుగుతున్న సామాజిక పరిణామాలకు నిలువుటద్దంగా కనబడుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు వర్తమాన సమాజంలో జరుగుతున్న సంఘటనలు వాస్తవిక విషయాల ఆధారంగా నిర్మిస్తూ ఉంటారు. దశాబ్దం క్రితం 2011లో తమిళంలో అత్యంత విజయం సాధించిన “కో” సినిమా తెలుగు మాధ్యమంలో “రంగం” సినిమా ఘన విజయం సాధించింది.

రంగం సినిమా ఢిల్లీ రాష్ట్ర రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్థానం ఎన్నికల విజయం ప్రతిబింబంగా చూపబడింది.తమిళంలో కో తెలుగులో రంగం చిత్రాలను ప్రజల ముందు ఉంచిన దర్శకుడు కె.వి.ఆనంద్ అందులో ప్రధాన పాత్రధారి అశ్వద్ధామగా నటించిన జీవా సహజంగానే తమ నిజ జీవితంలో కూడా ఫోటో జర్నలిస్టులే కావడం సినిమా సైతం సహజంగానే ప్రజలు ఆకట్టుకుంది.

హీరో అశ్వత్థామ పాత్రలో జీవా ప్రత్యామ్నాయ రాజకీయ రూపకర్తగా నవతరం పార్టీ నేతగా వసంత్ పాత్రలో అజ్మల్ అమీర్ పాత్రికేయురాలు సరస్వతి పాత్రధారిగా పియా బాజ్పేయ్,రేణుకగా జర్నలిస్టు పాత్రలో కథానాయికగా నటించిన కార్తీక నాయర్, పేరు ప్రస్తావనకు లేని నక్సలైట్ నేతగా వ్యవస్థ పరిచయంగా బోస్ వెంకట్ బృందం పాత్రలు గత ఏడు సంవత్సరాల కాలంగా దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్థాన వ్యవహారాన్ని కేజ్రీవాల్ బృందం తీరు అద్దం పట్టేలా కో, రంగం సినిమాలు ఉన్నాయి.

దర్శకుడు దశాబ్ద కాలం క్రితం తీసిన సినిమా ఢిల్లీ రాజకీయాల నిజస్వరూపాన్ని ప్రస్తుతం వెల్లడిస్తున్నట్లు మనం అర్థం చేసుకొని భావించాల్సిన సమయం. పద్నాలుగు సంవత్సరాల క్రితం ఢిల్లీ మహానగరంలో అన్నా హజారే నేతృత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం లోక్ పాల్ బిల్లు సాధనా ఉద్యమం తదనంతరం జరిగిన నిర్భయ ఉద్యమం అట్టడుగు సాధారణ మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, విద్యావంతులు మేధావులు యువకులను విశేషంగా ఆకర్షించి ఢిల్లీ రాజకీయాలను ప్రత్యామ్నాయ మార్పు దిశగా అడుగులు వేయించింది.

అయితే షీలా దీక్షిత్ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని ఢిల్లీ సాధారణ మధ్య తరగతి ప్రజలు ఆదరించ లేకపోయారు. అన్నాహజారే నేతృత్వంలో సాగుతున్న బృహత్తర మహా ఉద్యమంలో అవకాశవాద శక్తుల చేరిక ప్రత్యామ్నాయ మార్గాన్ని మార్చేసిందని చెప్పవచ్చు. సహజంగానే మావోయిస్టు ప్రభావిత నక్సలైట్ కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన అరవింద్ కేజ్రీవాల్ గాంధేయ మార్గంలో కొనసాగుతున్న అన్నాహజారే ఉద్యమాన్ని హైజాక్ చేశారని పదేళ్ల క్రితం నుండి ఇప్పటివరకు యావత్ దేశ ప్రజలు ముఖ్యంగా ఢిల్లీ వాసులు ఎవరు గ్రహించలేకపోతున్నారు.

సామాన్య మధ్య తరగతి ప్రజల ఆలోచనలకు,ఆశలకు అనుగుణంగా అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చాకచక్యంగా కేజ్రీవాల్ వాడుకోగలిగారు.ఇక మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్ ఇతర భాగస్వామ్య పక్షాలు చేసిన అత్యంత అవినీతి ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ దీర్ఘకాలం పరిపాలన అటు ఆమ్ఆద్మీ పార్టీకి ఇటు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వానికి వరంగా మారింది.

2011 వ సంవత్సరంలో రాజధాని ఢిల్లీ కేంద్రంగా అన్నా హజారే నేతృత్వంలో ఉదృతంగా సాగిన ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్,కిరణ్ భేడి ఇరువురు అన్నాహజారేకు అనుచర,సహచరులుగా నేతృత్వం వహించారు.ముందస్తు ప్రణాళికలో భాగంగానే మావోయిస్టు భావజాలం కలిగిన అరవింద్ కేజ్రీవాల్ సమయ సందర్భాలను అంచనా వేసి 2012లో ఆమ్ ఆద్మీ పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించారు. కేవలం సామాజిక దృక్పథంలో సాగిన అన్నా హజారే నేతృత్వంలోని ఉద్యమాన్ని రాజకీయాలకు ఎన్నికలకు వాడుకోగలిగారు అరవింద్ కేజ్రీవాల్.

స్వచ్ఛందంగా ఉదృతంగా సాగుతున్న సామాజిక ఉద్యమాన్ని ఎన్నికలు,రాజకీయాల అవసరం కోసం వినియోగించుకున్నాడు అరవింద్ కేజ్రివాల్. ఆయన బృందాన్ని అన్నాహజారే సైతం విమర్శించి అసహనాన్ని ప్రదర్శించిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి.రాజకీయ పార్టీల విరాళాలను స్వచ్ఛందంగా వెల్లడిస్తానన్న కేజ్రీవాల్ మాటతప్పిన తీరును హజారే గతంలోనే విమర్శించారు.2013లో జరిగిన ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన ఆప్ పార్టీ విజయం సాధించి కేవలం 49 రోజులు మాత్రమే అధికారంలో ఉండగలిగింది.

అనంతరం 2015, 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి మరో రెండు సార్లు అధికారంలోకి వచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఇక చలనచిత్ర రంగంలో భారీ విజయం సాధించి సగటు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కో, రంగం సినిమాల్లో మాదిరిగానే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్థానం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం వ్యవహారం కొనసాగిందని చెప్పవచ్చు.

సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఆశలు పెంచి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ రంగం సినిమాలో మాదిరిగా ఎన్నో కుట్రలు కుతంత్రాలు నడిపారని వర్తమాన పరిస్థితులు చెబుతున్నాయి. ఆ సినిమాలోని పాత్రలు మాధిరి ఎన్నో పోలికలు ఢిల్లీ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో షాహీన్ బాగ్ వద్ద రోజుల తరబడి జరిగిన నిరసన ఉద్యమం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళికల్లో భాగంగా కుట్రపూరితంగా జరిగిందన్నది. రంగం సినిమాలు నక్సలైట్ నేత బోస్ వెంకట్ బృందం బ్యాంకు దోపిడి చేసిన తరహాగా ఆర్థిక నేరాలకు పాల్పడిన కొంతమంది కేజ్రీవాల్ పార్టీ నిర్వహణకు ఎన్నికలకు సహకరించారన్న ఆరోపణలు గతంలో వచ్చిన విషయం విదితమే.

అలాగే బోస్ వెంకట్ బృందం ఎన్నికల ప్రచారంలో కుట్రపూరిత ప్రచారం ఆర్భాటంతో సామాన్య మధ్య తరగతి ప్రజలను ఓటర్లను విద్యావంతులను రెచ్చగొడుతున్న తీరులోనే కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారన్నది అర్థం చేసుకోవచ్చు. సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే బదలు ఎన్నికల్లో ఉచిత తాయిళాలు అందించి అధికారంలోకి వచ్చిన తీరు కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసమే అన్నది ప్రజలు సమీప భవిష్యత్తులో గుర్తించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ ప్రజలకు అర్థమైంది. సినిమా క్లైమాక్స్ లో నక్సలైటు నేతగా పాత్రలో కనిపించిన బోస్ వెంకట్ వెల్లడించిన మాదిరిగా విశ్వవిద్యాలయాల్లో అధికార వర్గాల్లో చివరకు మీడియాలో సైతం మా వాళ్ళు ఉన్నారు అన్న కోణంలో ఢిల్లీ మహానగరంలోని అన్ని విశ్వవిద్యాలయాలు అనుబంధ కళాశాలలో ఉన్న మేధావులుగా చలామణి అవుతున్న అర్బన్ నక్సలైట్లు, వామపక్ష నాయకత్వం, మతం పేరిట విశ్వవిద్యాలయాల్లో తిష్ఠ వేసిన పలు సంస్థలు సంఘాల నాయకత్వం అంతా కేజ్రీవాల్ ను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేశారు అన్నది వాస్తవం.

అంతేకాదు సినిమాలో బాంబు పేలుడును జర్నలిస్టు పాత్రధారి సరస్వతి గుర్తించి హత్యకు గురైన మాదిరిగానే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అన్వర్ తారీఖ్ ఆయన అనుచరుల చేతిలో ఢిల్లీ నిఘా విభాగం అధికారి అంకిత శర్మ దారుణ హత్యకు గురవడం కేజ్రీవాల్ నిజస్వరూపం బయటపడింది.

జర్నలిస్టు పాత్రలో సినిమాకు ప్రధాన నాయకి నాయకుడిగా పాత్రలో నటించిన రేణుక ,అశ్వత్థామ (జీవా కార్తీక నాయర్) పాత్రలు ఆ సినిమాలో నవతరం రాజకీయ పార్టీ నేత వసంత్ కు ప్రచార ప్రసార సాధనాలు సహకరించిన మాదిరిగానే కేజ్రివాల్ కు సహకరించారు ఇందులో కేజ్రివాల్ కు సహకరించాలన్న తాపత్రయం కంటే బీజేపీని ఈ పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా చేయాలన్న తో పనిచేసిన మేధావుల రూపంలో ఉన్న అర్బన్ నక్సలైట్లు వామపక్ష నాయకత్వం మరియు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రభావం చూపగల ఖలిస్తాన్ లాంటి వేర్పాటువాద జాతి వ్యతిరేక గ్రూపులన్నీ ఆప్ పార్టీని అధికారంలోకి వచ్చేలా చేశాయి.

సినిమా చివరలో అరవింద్ కేజ్రీవాల్ తో పోల్చుకున్న నవతరం పార్టీ నేత వసంత్ పాత్ర కుట్రలు బయటపడ్డ తీరుగానే బయటకు తీసిన అశ్వత్థామ పాత్ర తీరుగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కుట్రలు మరికొన్ని రోజుల్లో బయట పడే అవకాశాలు అధికంగానే ఉన్నాయి అన్నది ఈ మధ్య ఢిల్లీ అల్లర్ల సందర్భంలో అవగతమవుతోంది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఆప్ నేత తారిక్ అన్వర్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు పలుమార్లు ఫోన్ కాల్స్ చేశారన్న విషయం బయటకు రావడమే నిదర్శనంగా చెప్పవచ్చు.

ఎన్నికల అనంతరం ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సిరియా, పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,సౌదీ దేశాల్లో వినియోగించిన విధ్వంస సాధనాలను ప్రయోగించిన తరహాలోనే ఆప్ నేతలు తారిఖ్ అన్వర్ మరికొంతమంది నివాస ప్రాంతాల్లో విధ్వంస సాధనాలను గుర్తించడం ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహార శైలి బట్టబయలవుతోంది.

ఢిల్లీ పాలన చేపట్టిన తర్వాత దేశ నలుమూలల విస్తరించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆకాంక్షలను సామాన్యుడి మనోభావాల కోణంలో ప్రజలు స్వాగతించడం జరిగింది. కానీ అప్పుడు విస్తరణ కోణంలో కుట్రలు బాగా ఉన్నాయని తెలియడం దేశాన్ని విస్మయానికి గురి చేసింది.పూర్వ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమారు విశ్వాస్ అరవింద్ కేజ్రీవాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.పంజాబ్ కు విస్తరించిన క్రమంలో ఖలిస్తాన్ తో చేతులు కలిపి భవిష్యత్తులో ప్రత్యేక పంజాబ్ దేశానికి ప్రధానమంత్రి కావాలన్న తన మనోగతాన్ని తనకు వివరించాడని బాహాటంగా పత్రికలకు వివరించాడు కుమార్ విశ్వాస్.

అంతే కాదు 2014 నుంచి 2022 వరకు 16 మిలియన్లు అంటే దాదాపు 134 కోట్ల రూపాయలు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళాలు ఇచ్చామని అందుకు ప్రతిగా ఖలిస్తాన్ ఉగ్రవాద నేత 1993 ఢిల్లీ బాంబు పేలుళ్లలో ప్రధాన దోషగా ఉన్న దేవేందర్ పాల్ సింగ్ బుల్లర్ ను జైలు నుంచి విడుదల చేస్తామని తమకు హామీ ఇచ్చాడని ప్రత్యేక ఖలిస్తాన్ ఉగ్రవాదనేత గురు పత్వంత్ పున్నన్ ఆరోపించిన విషయం విధితమే.

అరవింద్ కేజ్రీవాల్ రైతుల ఉద్యమం పేరిట షహీన్ భాగ్ అల్లర్ల పేరిట దేశ రాజధాని ఢిల్లీలో మరియు సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్ గోవాలో తమ దేశ విచ్చిన్న జాతి వ్యతిరేక పథకాలను అమలు చేసేందుకు పకడ్బందీగా కుట్రలు అమలు చేశాడు అన్నది నేటి పరిస్థితులను చూస్తే అవగతమవుతుంది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరనట్టు సమాజ హితాన్ని కోరి ప్రారంభించిన ఉద్యమాన్ని హైజాక్ చేసిన కేజ్రీవాల్ అవినీతి కుంభకోణంలో దోషిగా నిలబడడంతో అన్నాహజారే,సంతోష్ హెగ్డేలు తీవ్ర మనోవేదనకు గురయ్యారని వారు ప్రకటనలు తెలియజేస్తున్నాయి.

ఎన్ని కుట్రలు కుతంత్రాలతో రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ కేవలం అధికార కేంద్రం కాపాడుకోవడానికి మాత్రమే ఒక మార్గంలో సామాన్య మధ్యతరగతి ప్రజల ఆశలను ఆలోచనలను రెచ్చగొడుతూ,ఉచిత తాయిళాలు అందిస్తూ మరో మార్గంలో సంఘ జాతి వ్యతిరేక శక్తులకు ఆజ్యం పోస్తూ వారి చర్యలకు సహకరిస్తూ దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర ప్రజలను,దేశ ప్రజలను వంచిస్తున్నారు.

రాజకీయ అధికారంకోసం రంగం, కో సినిమా తరహా కుట్రల కుతంత్రాలను చేస్తున్న కేజ్రీవాల్ చర్యలను ప్రజలు సమీప భవిష్యత్తులోనే గమనించి తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఏది ఏమైనా రాజకీయ అధికారం కోసం నీతిమంతులుగా చలామణి అవుతూ కుట్రలను,కుతంత్రాలను అమలు చేస్తూ సంఘ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అవుతున్న కొంతమంది నేతల తీరును రాజకీయ పార్టీల తీరును కళ్లకు కట్టినట్లు చూపించిన కో, రంగం సినిమాలో దర్శకుడు కె.వి.ఆనంద్ , అందులో తారాగణంగా నటించిన నటులను అభినందించాల్సిందే.


కొట్టె మురళీకృష్ణ
కరీంనగర్