ఏది మన ఆత్మగౌరవం ?
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ సిద్ధమవుతోంది. దశాబ్ది వేడుకలు జరుపుకునేందుకు సమాయత్తం అవుతున్నది. పదేళ్లుగా రాష్ట్రానికి ఉన్న రాజముద్రను మార్పు, రాష్ట్రగీతం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చజరుగుతోంది. భిన్నవాదనలు, విభిన్నఅభిప్రాయాలు వెలువడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు అవుతుంది. వచ్చే నెల జూన్ 2న రాష్ట్రం దశాబ్ది వేడుకలను జరుపుకోనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకల్లో ప్రధానంగా రాష్ట్ర గీతాన్ని, నూతన రాష్ట్ర రాజముద్రను వెలువరించాలని కసరత్తు చేస్తుంది. అందుకనుగుణంగా.. ఇప్పుటికే రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ గేయాన్ని ప్రకటించగా.. గేయంలో స్వల్ప మార్పులు చేయనున్నారు. అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే ఆ గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందెశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదముద్ర వేసింది. ఆ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణితో కంపోజింగ్ చేశారు.

ఇక అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తెలంగాణ గీతాన్ని వినిపించారు. ఈ గీతం చాలాబాగుందని రేవంత్ కితాబిచ్చారు. అయిదారు చరణాలతో పూర్తి గీతం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి రెండు చరణాలను మాత్రమే రాష్ట్రం గీతంగా ప్రకటించారు. ఈ రెండు చరణాల్లో తెలంగాణ ఆవిర్భావం ఎలా జరిగింది, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకొచ్చేలా రాష్ట్ర గీతం ఉండనున్నది. జూన్2న రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ తర్వాత రాష్టాన్రికి సంబంధించిన పలు కీలక సమావేశాల సమయాల్లో తెలంగాణ గీతాన్ని ఆలపించే అవకాశం ఉంది.

అందెశ్రీ రచించిన ఈ గేయానికి కీరవాణి కంపోజింగ్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. తెలంగాణలో అనేకమంది కవులు కళాకారులు ఉన్నారని, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారని అలాంటప్పుడు.. ఆంధ్రప్రాంతానికి చెందిన కీరవాణీని ఎందుకు ఎంపిక చేసుకోవాలని అందెశ్రీకి కాల్ చేసి మరి నేరుగా ప్రశ్నిస్తున్నారు. పెద్దస్థాయిలో ఉండి.. ఇలాంటి ఒడిదొడుకులు చేయకుండా ఉండాల్సిందని సూచిస్తున్నారు.
తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన గేయాన్ని, తెలంగాణ ఆత్మకు చెందిన గేయాన్ని.. రాష్ట్రాన్ని ముప్పు తిప్పలు పెట్టి, ఎవరిపై అయితే పోరాడామో.. వారితోనే.. మళ్లీ మన పాటలు పాడించుకోవాలా..? అని నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గేయ రచయిత అందెశ్రీ ఈ విషయంలో పునరాలోచన చేయాల్సి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్ర గీతం విషయాల్లో అటు తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తమ పట్టు వీడడం లేదు. తెలంగాణా అధికారిక గీతం ఎంతో ప్రతిష్టాత్మకం కాబట్టి దానికి సంగీతం చేసే బాధ్యతను తెలంగాణ సంగీత దర్శకుడికి అప్పగిస్తే బాగుండేదని అంటున్నారు. ఆంధ్రా సంగీత దర్శకుడికి ఈ బాధ్యత ఇవ్వడమంటే తెలంగాణను అవమానించడమేనని మండిపడుతున్నారు.
తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, ఆత్మ గౌరవం కోసమని అలాంటిది ఇప్పుడు ఆ మౌలిక భావనకే విఘాతం కలిగిందని అంటున్నారు. తెలంగాణలో ప్రతిభగల కళాకారులు లేరా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఓ వందేమాతరం శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, చరణ్ అర్జుణ్, భోలే శావలి, వరికుప్పల యాదగిరి లాంటి ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఓ తెలంగాణ బిడ్డకు ఆ సదావకాశాన్ని ఇస్తే బాగుండు కదా అని ఆలోచన చేస్తున్నారు. అయితే తెలంగాణ సంగీత కళాకారుల ఆవేదనకు ప్రభుత్వం నుంచి గానీ, పాట రచయిత నుంచి గానీ ఏమీ స్పందన రాలేదు. అసలు రేవంత్ రెడ్డి ఇదేమీ పట్టించుకోలేదు. జూన్ 2నాడు కీరవాణీ సారధ్యంలో రాష్ట్రగీతం రానే ఉంది.
ఇక మరోవైపు రాజముద్రపై కూడా వివాదం రాజుకుంది. రాజముద్రను మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజముద్రపై కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చూసాం. రాజముద్రలో రాచరిక పోకడలు ఉన్నాయని వాటి స్థానంలో అమరుల త్యాగాలు, తెలంగాణ సంప్రదాయాలు గుర్తుకొచ్చేలా కొత్త లోగో తయారు చేస్తున్నామని చెప్పారు.

ఈ లోగో అంశం రాష్ట్రంలో చర్చలకు దారి తీస్తుంది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ లోగోలో కాకతీయ కళాతోరణం, చార్మినార్, జాతీయ చిహ్నంతో కూడుకొని ఉంది. ఈ లోగోను ప్రముఖ కళాకారుడు ఆలే లక్ష్మణ్ చిత్రీకరించాడు. తెలంగాణ వారసత్వ సంపదకు, తెలంగాణ చారిత్రక నేపథ్యానికి, వెయ్యి ఏళ్ల సాంస్కృతిక వైభవానికి, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు. ఇదే అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ సైతం విమర్శలు చేశారు. తెలంగాణ కేబినెట్లో ఉన్న ఏ ఒక్కరికి కూడా తెలంగాణ సాంస్కృతిక సంపదపై, వారసత్వంపై ఏవిధమైన పరిజ్ఞానం లేదని ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.
రాష్ట్రం రాజముద్రలో ఎలాంటి వివాదం లేకున్నా దీన్ని తెరపైకి తెచ్చి కావాలని గత ప్రభుత్వ రూపురేఖలు మార్చే యోచనలో భాగంగానే వివాదం లేని అంశాన్ని పనికట్టుకొని వ్యక్తిగత ప్రాధాన్యత కోసం లోగో మార్పును చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జజయహే తెలంగాణ గీతంలో “కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్” అంటూ పాడుకుంటే లేని తప్పు.. లోగోలో ఉంటేనే తప్పవుతుందా అనే విమర్శలు ఎదురవుతున్నాయి. అయినా ప్రభుత్వం మారితే రాజముద్ర మార్చాలా?, ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి ఆలోచనలు తగ్గట్టుగా మార్చుకుపోతారా..?, ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి రాజముద్రను మారుస్తూ పోతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
శరత్ చారి
జర్నలిస్ట్
……………………..
