గౌరవ సభాపతి గారికి నమస్కారం… సహచార గౌరవ సభ్యులందరికీ నమస్కారం… ముఖ్యంగా తామే “రైతు మిత్రులం ” అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నా నమస్కారం.
సార్, ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందంటే.. రైతుల పాలిట యమపాశం లెక్క తయారైంది. ఈ రెండు ఏండ్లల్లనే దాదాపు 700 మందికి పైగా రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడారు. చనిపోయినోళ్లు మీకు ఉత్త లెక్కలే కావొచ్చు, కానీ ఒక్కసారి ఆ ఇండ్లల్ల పోయి చూడండి .. ఆ తల్లుల కన్నీళ్లు, ఆ పిల్లల ఏడ్పులు చూస్తుంటే గుండె రగిలిపోతంది.వాళ్ళ కలలు,జీవితాలు వల్లకాడు అయినయి.
రేవంత్ రెడ్డి గారు.. నమ్మించి గొంతు కోసే కసాయి లెక్క..రైతులను నమ్మించి వాళ్ల ఆశలను ఖతం జేశిండు..నమ్మించి నట్టేట ముంచిండు.
- రైతు భరోసా: ఎన్నికల ముందు ఏమన్నరు? ₹15,000 ఇస్తమని ఊదరగొట్టిన్రు. గద్దెనెక్కినంక ఏమైంది? గుట్టు చప్పుడు కాకుండా ₹12,000 కు కుదించిన్రు. ఆ ఇచ్చే పైసలు కూడా ఎప్పుడు వస్తయో ఎవ్వనికీ తెల్వదు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. అప్పుడు గుర్తొస్తది వీళ్లకు రైతు భరోసా!
- బోనస్ మోసం: 2025 ఖరీఫ్ కు బోనస్ ఇస్తమంటున్నరు.. మరి గతేడాది 2024 ముచ్చట ఏంది? దాన్ని పాత చెత్తల పారేసిన్రు. దాదాపు ₹1,160 కోట్లు ఇంకా బాకీ ఉన్నరు. 4 లక్షల మంది రైతులు అరిగోస పడుతుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం దావత్‌లల్ల మునిగితేలుతున్నారు.
మీరు రైతులకు ఇస్తామని చెప్పిన “రైతు భరోసా” ఇదేనా…?
లేక రైతన్నలతో తమాషా నా ? - కౌలు రైతుల గోస:
“ఇక కౌలు రైతుల ముచ్చట చెప్పాల్నా సార్? ఈ కాంగ్రెస్ సర్కారుకు వాళ్లు అస్సలు మనుషుల లెక్క కూడా కనిపిస్తలేరు.తెలంగాణల వాళ్లు ఉన్నరో లేరో అన్నట్టు చూస్తున్నరు..
ఎన్నికల ముందు మీ మేనిఫెస్టోల ఏమని రాసిన్రు సార్? ‘కౌలు రైతులకు కూడా కడుపు నిండా సాయం చేస్తాం, వాళ్లను కూడా కలుపుక పోతాం’ అని తీయటి పాటలు పాడిన్రు. ఇవాళ ఏమైంది సార్ ఆ పాటలు? అంతా శ్మశానం లెక్క నిశ్శబ్దం అయిపోయింది! సొంతంగా ఒక్క గుంట భూమి లేకున్నా.. కౌలుకు తీసుకొని ఎండనక, వాననక రెక్కలు ముక్కలు చేసుకుని బతుకుతున్న ఆ కౌలు రైతుల కోసం ఒక్క మాటన్న మాట్లాడిన్రా? ఒక్క పైసా అన్న ఇచ్చిల్లా ?
వాళ్ళని నిరాశ కలిగించే విషయం మాత్రమే కాదు గౌరవ సభ్యులారా, ఇది తేలు కాటు వేసినట్టు వాళ్ళ గుండెల్లో బాధ కలిగించే నమ్మక ద్రోహం!” సార్
ఇది కరువు కాదు.. సర్కారు చేసిన కుట్ర!
“స్పీకర్ సార్, ఒక్కసారి జనగామ, పాలమూర,నల్గొండ జిల్లాల్లో చుడండి.. కన్న బిడ్డల లెక్క సాదుకున్న వరి పంట, మక్కజొన్న చేలు కళ్ల ముందే మాడి మసి అయిపోతుంటే ఆ రైతన్న గుండె తరుక్కుపోతుంది.తల్లడిల్లుతోంది.
రిజర్వాయర్లల్ల నీళ్లున్నయ్, కాలువలల్ల నీళ్లున్నయ్.. కానీ ఆఖరి ఎకరాకు చుక్క నీరు అందతలేదు. కాలువలను ఎడారి లెక్క మార్చిన్రు. భూగర్భ జలాలు ఎనిమిది మీటర్ల లోతుకు పాతాళానికి పోయినయ్. సార్.. ఇది వానలు పడక వచ్చిన కరువు కాదు, ఇది ముమ్మాటికీ ఈ చేతగాని సర్కారు తెచ్చిన కృత్రిమ కరువు’!
ఇక వడ్ల కొనుగోలు ముచ్చట చెప్పాల్నా సార్?
ఇది రైతులకి ఒక భయంకరమైన నరకం అయిపోయింది సార్.
రైతన్నలు ఆశలతో, రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటను బస్తాల్లో
నింపుకొని ప్రోక్యూర్‌మెంట్ సెంటర్లకి వస్తారు. కానీ అక్కడ వాళ్లకి దొరికేది సహాయం కాదు… లైన్లు మీద లైన్లు, నిర్లక్ష్యం మీద నిర్లక్ష్యం.
గంటల కొద్దీ కాదు… రోజుల తరబడి నిలబడి నిలబడి
అలసిపోతారు…అవమానపడతారు…
కళ్ల ముందే వానకు వడ్లు తడిసి మొలకలు వస్తుంటే.. ఆ రైతు గుండె ఎట్లా తల్లడిల్లుతుందో ఒక్కసారి ఆలోచించిన్రా?
ఆఫీసర్ల ఆఫీసులల్ల గడియారాలు నిమ్మళంగా తిరుగుతుండొచ్చు,ఫైళ్లు మెల్లగా కదులుతుండొచ్చు.. కానీ అక్కడ రైతు ప్రాణం గాలిల కలిసిపోతున్నది. యూరియా కోసం ఎట్లా ఏడిపించిన్రో, వడ్ల కాడ కూడా అట్లనే చంపుతున్నరు. సార్, సభ సాక్షిగా మళ్లీ చెబుతున్నా.. ఒక రైతు తన వడ్ల కుప్ప మీదనే ప్రాణం విడిచిండు! ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకుని చెప్పండ్రి.. బతికున్న మనిషి మీ సర్కారును నమ్మి వచ్చి, కుప్ప మీదనే శవమై పడి ఉంటే అది జాప్యం ఎట్లయితది? అది ముమ్మాటికీ సర్కారు చేసిన ఖూనీ! మీరు పెట్టే నిబంధనలు,ఆఫీసర్ల తిప్పలు రైతుల ప్రాణాలు తీస్తున్నయ్. ఆ రైతు రక్తం మీ చేతులకు అంటి ఉన్నది. ఇది అచ్చంగా ‘పాలన’ పేరుతో మీరు చేస్తున్న హత్యాకాండ!”
యూరియా విషయానికి వస్తే సార్ రైతన్న పడుతున్న కష్టాలు చూస్తే బాధగా ఉంది సార్.
పొలానికి ఎరువు వేయాలంటే ఇప్పుడు రైతు యాప్‌ల్లో తిరగాలి, స్లాట్లు చూసుకోవాలి
కానీ చివరికి దొరికేది యూరియా కాదు…
బ్లాక్ మార్కెట్ దోపిడీ.
ఒక బస్తా యూరియా కోసం రైతన్న ₹200 అదనంగా ఇవ్వాలి అంటున్నారు.
పొలాన్ని బతికించాలంటే రైతు తన జేబు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది సర్..
పేదల పక్షపాతి అని ముచ్చట్లు చెప్పే కాంగ్రెస్.. ఇయ్యాల రైతుల కడుపు కొట్టి కాసులేరుకుంటాంది.
తెలంగాణలో మీ ఏలుబడి చూస్తుంటే ‘జై జవాన్, జై కిసాన్’ ఎక్కడా కనిపిస్తలేదు. అంతా ‘జై కాంగ్రెస్.. జై కరప్షన్ ‘ అన్నట్టు తయారైంది.
ఈ రోజు తెలంగాణలో విద్య గురించి మాట్లాడాలి అంటే మనం సిగ్గుపడాలి.
ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లల నవ్వులు,చదువుల హోరు వినిపించేవి.
కానీ ఈరోజు ఆ నవ్వులు మాయమయ్యాయి…
ఇయ్యాల ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేని దుస్థితిలో మన విద్యారంగం పేకమేడలా కూలిపోతాంది. సర్కారు చేసే ప్రతి తప్పు నిర్ణయం పిల్లల భవిష్యత్తు మీద గొడ్డలిపెట్టులా మారుతాంది.
బడ్జెట్ ముచ్చట చూస్తే.. బిఆర్ఎస్ హయాంలోనే 9 శాతం ఉంటే, ఇయ్యాల కాంగ్రెస్ దాన్ని 8 శాతానికి పడేసింది. పక్క రాష్ట్రాలు 14-15 శాతం పెడుతుంటే, బీహార్ లాంటి రాష్ట్రాలే 20 శాతం ఖర్చు పెడుతున్నయ్.ఒక్కసారి బడ్జెట్ ముచ్చట చూడండి.. గప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 9 శాతం ఉంటే, ఇయ్యాల కాంగ్రెస్ దాన్ని 8 శాతానికి పడేసింది. పక్కన బీహార్ లాంటి రాష్ట్రాలే 20 శాతం ఖర్చు పెడుతుంటే, మీరు మాత్రం మన బిడ్డలను అక్షరం ముక్క రాకుండా అగాధంలోకి నెట్టేస్తున్నరు.
బడుల పరిస్థితి చూస్తే గుండె చెరువవుతాంది. ఒక్క పిల్లాడు కూడా లేని బడులు 1,672 నుంచి 2,245 కి పెరిగినయ్. దేశం మొత్తం మీద ఇట్లాంటి బడులు 40 శాతం ఒక్క మన తెలంగాణలోనే ఉన్నయంటే.. ఇది మనకు అవమానం కాదా? ఆ క్లాస్‌రూములు చూస్తుంటే వల్లకాడిలెక్క కనిపిస్తున్నయ్. బిడ్డల చదువుల కోసం ఆ తల్లుల కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నరు.
ఇక హాస్టళ్లలో చావులు.. అది ఫుడ్ పాయిజన్ కాదు, మీ నిర్లక్ష్యం అనే పాయిజన్! పాలసి తయారుచేయలేని పాయిజన్.. ఐదేళ్లలో 60 మంది చనిపోతే, మీ కాంగ్రెస్ వచ్చిన ఈ రెండేళ్లలోనే 50 మంది బిడ్డల ప్రాణాలు పోయినయ్. వేల మంది హాస్పిటల్ పాలవుతున్నరు. పిల్లలకి పెట్టే తిండిలో కూడా భద్రత లేని దౌర్భాగ్యమిది.
స్కూళ్లలో సౌకర్యాల ముచ్చట చెబితేనే అసహ్యం వేస్తాంది. ఇది మనుషుల పాలననా లేక రాక్షస పాలననా? 1,859 బడుల్లో తాగనీకే చుక్క నీళ్లు లేవు. ఎండిపోయిన ఆ నల్లాలు చూస్తుంటే.. పిల్లల ఆశలు కూడా అట్లే ఎండిపోతున్నట్టు అనిపిస్తాంది.
ఇక టాయిలెట్ల గొడవ చూస్తే.. దేశం మొత్తం మీద మన తెలంగాణ అట్టడుగున ఉంది. 1,752 ఆడబిడ్డల స్కూళ్లలో కనీసం బాత్రూంలు లేక వాళ్లు పడుతున్న అవమానం వర్ణనాతీతం. 4,000 బాలుర స్కూళ్లలో కూడా ఇదే దుస్థితి. రాష్ట్రంలో ఉన్న 30,014 స్కూళ్లలో 21,126 బడులు శిథిలావస్థకు చేరుకున్నయ్. ఆ గోడలు ఎప్పుడు పడతాయో తెలియదు.. ఆ క్లాస్‌రూములు చూస్తుంటే చదువుల కోవెలల్లా లేవు, చిన్న పిల్లలను బంధించే జైళ్ల లెక్క కనిపిస్తున్నయ్.”
ఫీజు రీయింబర్స్‌మెంట్ ముచ్చట అయితే ఒక పెద్ద జోక్ లెక్క తయారైంది. పది వేల కోట్ల రూపాయల బకాయిలు అట్లనే పెండింగ్‌లో పెట్టిర్రు. దీనివల్ల రాష్ట్రంలో రెండు వేల కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఎగ్జామ్స్ రాయకుండా పిల్లలు రోడ్లెక్కి కొట్లాడుతుంటే సర్కారుకు సోయి లేదు.
పైగా ఇప్పుడు ఆ స్కీమునే ఎత్తేస్తామని లోపల లోపల గుసగుసలు వినిపిస్తున్నయ్. అట్ల చేస్తే లక్షల మంది పేద బిడ్డల చదువుల మీద బండలేసినట్టే. అక్షరం నేర్చుకుని పైకి వద్దామనుకుంటున్న ఆశల మీద మీరు పెద్ద గునపం దించుతున్నరు. ఆశగా ఎదురుచూస్తున్న పేదోడి ఇంటి దీపాన్ని ఆర్పేసే కుట్ర ఇది.”
ఇది కేవలం సర్కారు చేతగానితనం మాత్రమే కాదు.. ఇది మన బిడ్డల మొహాల్లో కనిపిస్తున్న తీరని ఆవేదన. మనం ఇప్పుడన్న మేల్కోకపోతే, మన పిల్లల భవిష్యత్తు అంధకారమైతది. మన చదువుల ఆలయాలను మనం కాపాడుకోవాలె.
న్యాయం కోసం గొంతెత్తాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, మన బిడ్డల రేపటి కోసం.. ఇప్పుడే కొట్లాడాలె, ఇప్పుడే నిలదీయాలె. లేదంటే రేపు మన పిల్లలకు మనం సమాధానం చెప్పుకోలేం
తెలంగాణ అంటేనే తిరుగులేని యువశక్తి. ఎన్నో ఆశలతో, ఆశయాలతో మన బిడ్డలు కాంగ్రెస్ ని నమ్మిండ్రు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన గాయాలను మీరు మాన్పుతారని, ఉద్యోగాలిచ్చి బతుకుదెరువు చూపుతారని ఓట్లేసి గెలిపించిండ్రు. కానీ మీరు చేసిందేంది? అదే పాత మోసం.. అదే దగా!
గప్పుడు గ్రూప్-1 ల ఏ తీరుగ అక్రమాలు జరిగినయో.. ఇప్పుడు మీ పాలనలో కూడా అవే తప్పులు రిపీట్ అవుతున్నయ్. బీఆర్ఎస్ టైంలో జరిగిన గ్రూప్-1 కుంభకోణాన్ని అటకెక్కించిండ్రు. ఆ తప్పు చేసినోళ్లను పట్టుకోకుండా, వాళ్లతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అసలు దొంగలను తప్పించిండ్రు.
నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాలె, ఎగ్జామ్స్ అంటే నమ్మకం లేదు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెల్వదు.. అదంతా గాలిలో దీపం లెక్క తయారైంది. మా యువతకు మీ డొల్ల మాటలు వద్దు.. కావాల్సింది అర్హులైన వాళ్లకు ఉద్యోగాలు, మెరిట్ ఉన్నోళ్లకు ప్రాధాన్యత. మీ చుట్టాలకు, అనుచరులకు దోచిపెట్టే పద్ధతి కాదు
ఉద్యోగాల విషయానికి వస్తే సార్..
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని గొప్పలు చెప్పుకున్నరు.. కానీ ఇయ్యాల ఖాళీలు చూస్తే నోరు వెళ్లబెడుతున్నయ్. నిరుద్యోగం ఊళ్లల్ల కార్చిచ్చు లెక్క అంటుకుంటాంది, కానీ మీరు మాత్రం ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తలేరు.
ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్థులు రోడ్డెక్కితే…
వాళ్లకు న్యాయం చేయాల్సింది పోయి లాఠీ ఛార్జ్‌లతో సమాధానం ఇస్తున్నారు.న్యాయం అడిగిన విద్యార్థులు నేరస్తులా సార్?
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే…
అవకాశాలు లేక, ఆశలు చచ్చిపోవడంతో
ఎంతో మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. కానీ మీకు మాత్రం కనికరం లేదు.
గౌరవ సభ్యులారా.. చనిపోయిన ఆ బిడ్డల మౌనం వినిపిస్తలేదా? ఆ నిశ్శబ్దమే మీరు చేసిన అబద్ధపు వాగ్దానాలకి నిదర్శనం. మీరు నమ్మించి గొంతు కోసినందుకు ఆత్మహత్య చేసుకున్న ఆ బిడ్డల ఉసుర్లు మీకే తగులుతయ్!”
నిరుద్యోగం అనేది మీ పాలనలో ఒక మహమ్మారిలా తయారైంది. మీరు తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాస్’ స్కీమ్ చూస్తే నవ్వులాటగా ఉంది. 16 లక్షల మంది అప్లై చేసుకుంటే, కేవలం లక్ష మందికి మాత్రమే శాంక్షన్ చేసిండ్రు..అది కూడా ఎవరికి అంటే మీ అనుచరులకు మాత్రమే ఇచ్చుకున్నరు. మిగతా లక్షల మంది గాలికి కొట్టుకుపోవాల్సిందేనా? ఇక 5 లక్షలు ఇస్తామన్న మాట దేవుడెరుగు.. చాలా మందికి లక్ష రూపాయలతోనే చేతులు దులుపుకున్నారు. ఇది సాయం కాదు.. నిరుద్యోగుల చెంప మీద కొట్టినట్టు ఉంది!
ప్రపంచమంతా AI (కృత్రిమ మేధ) తో దూసుకుపోతాంది, కొత్త కొత్త ఉద్యోగాలు వస్తున్నయ్. కానీ మన సర్కారుకు మాత్రం అసలు సోయే లేదు. AI వల్ల ఉద్యోగాల్లో వచ్చే మార్పుల మీద మీకు ఏమన్నా విజన్ ఉందా? మన యువతను రాబోయే కాలానికి సిద్ధం చేసే ఒక్క పాలసీ కూడా మీ దగ్గర లేదు. ఇప్పటికైనా నిద్ర లేచి, యువతకు కొత్త టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చే పద్ధతులు ఆలోచించకపోతే మన బిడ్డలు వెనకబడిపోతారు.
ఇక మీ పరిపాలన ఎంత గొప్పగ ఉందంటే.. ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నయ్. దావోస్ సదస్సుల్లో మీరు చేసిన అగ్రిమెంట్లు (MOUs) అన్నీ కాగితాల మీద పులుల లెక్కనే ఉన్నయ్ కానీ, నేల మీద ఒక్క కంపెనీ కూడా రావడం లేదు. అంతా బిల్డప్పులే తప్ప, అసలు పని మాత్రం సున్నా.”
మత రాజకీయాలు:
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరు చూస్తుంటే.. ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడా లేక ఒక వర్గం గురించే మాట్లాడుతున్నాడా అనే అనుమానం వస్తోంది. ఇప్పుడు ఆయన దాచుకునే ప్రయత్నం కూడా చేస్తలేడు. కాంగ్రెస్ పార్టీ, ముస్లింలు ఒక్కటేనని బాహాటంగానే ప్రకటిస్తున్నడు. లౌకికవాదం అనే ముసుగు తీసేసి, కేవలం ఓట్ల కోసం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. ఈ సర్కారు అందరిది కాదు, ఇది కేవలం ఒక వర్గం కోసమే నడుస్తోందని ఆయనే ఒప్పుకున్నట్టు ఉంది. ఇదంతా చూస్తూ మనం ఊరుకోవాల్నా?
సరే, ఇవన్నీ కేవలం రాజకీయ మాటలని వదిలేద్దాం అనుకున్నా.. ఆయన చేస్తున్న పనులు చూస్తే మాత్రం భయం వేస్తాంది. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేస్తున్న పనులు ఇక్కడి హిందువుల నమ్మకాన్ని, భద్రతను దెబ్బతీసేలా ఉన్నయ్. అసలు ఈ రాష్ట్రంలో చట్టం అనేది ఉందా? న్యాయం అనేది అందరికీ సమానంగా ఉందా
పోలీసులని నమ్మమంటరు, వ్యవస్థను నమ్మమంటరు.. కానీ ఈ సర్కారు చేసేవన్నీ పచ్చి వేషాలే! ఓవైసీ హాస్పిటల్ లాంటి కట్టడాల మీద ఫిర్యాదులు వస్తే, మీ ఈ ‘హైడ్రా’ (HYDRAA) కు కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు. ఆడికి పోంగనే వీళ్లకి పక్షవాతం వస్తదా? ఎందుకంటే దాన్ని ముట్టుకుంటే మీ ‘ఓటు బ్యాంకు’ కదులుతదని భయం. కానీ హిందువుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చట్టం చురకత్తిలా మారుతది, అదే ముస్లింల దగ్గరికి పోతే తుప్పు పట్టిన కత్తిలా పక్కన పడి ఉంటది.
సికింద్రాబాద్ నుంచి పాతబస్తా దాకా, కామారెడ్డి నుంచి నిర్మల్ దాకా.. మన గుళ్లు గోపురాలు కూలుతున్నయ్. ఇది కేవలం విగ్రహాలు పగలగొట్టడం కాదు.. మన సంస్కృతి మీద జరుగుతున్న దాడి. కట్ట మైసమ్మ గుడిలో జరిగిన దారుణం చూస్తే ఏ హిందువుకైనా రక్తం మరగాల్సిందే. మన పవిత్ర స్థలాల్లో అంతటి నీచానికి ఒడిగడితే, ఈ కాంగ్రెస్ సర్కారు ఏం చేసింది? స్పెషల్ ఫోర్స్ పంపిందా? ఉగ్రవాద ముద్ర వేసిందా? లేదు! కేవలం ఒక ‘ప్రెస్ నోట్’ వదిలి చేతులు దులుపుకున్నారు.
మీరు ‘శాంతి’ అని మాట్లాడుతుంటే.. అది మాకు పిరికితనంగా కనిపిస్తాంది. మీ ఓట్ల వేటలో భాగంగా మీరు చూపిస్తున్న ఈ మెతక వైఖరి వల్లనే ఇయ్యాల ఆదిలాబాద్, నిర్మల్, జైనూర్, బోధన్ లాంటి ఊర్లు అగ్నిగుండాల్లా మారినయ్. హిందువుల మీద దాడి చేస్తే ఏమీ కాదు అనే నమ్మకాన్ని ఈ సర్కారే వాళ్లకి ఇస్తాంది. ఇగ చాలు.. మీ డొల్ల మాటలు ఇక చెల్లవు!”
రెండు మతాలు.. రెండు రూల్సా?
ఇక ఆఫీసులల్ల నడిచే తంతు చూస్తే అసహ్యం వేస్తాంది. ఈ కాంగ్రెస్ సర్కారు రెండు రకాల చట్టాలు నడుపుతాంది. రంజాన్ వచ్చిందంటే చాలు.. అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ల కాళ్ల కింద వంగుతది. ముస్లిం ఉద్యోగులకు గంట ముందే సెలవిస్తారు, డ్యూటీ టైమింగ్స్ మారుస్తారు, అన్ని వెసులుబాట్లు కల్పిస్తారు.
మరి ఇదే వెసులుబాటు ఒక హిందూ పండుగకు అడిగి చూడండి.. సచ్చినా ఇవ్వరు! ఒక పూజ కోసమో, పండుగ కోసమో గంట ముందు వెళ్తామంటే.. వెంటనే ‘రూల్ బుక్కు’ తీసి మొహాన కొడతారు. ఇది కేవలం పద్ధతి కాదు, ఇది మమ్మల్ని అవమానించడమే! మా భక్తి అంటే మీకు భారమా? ఇంకో మతం అంటే అంత గౌరవమా? దీన్ని సెక్యులరిజం అనరు.. దీన్ని సర్కారు నడుపుతున్న ‘పక్షపాతం’ అంటారు. మా సొంత గడ్డ మీదనే మమ్మల్ని రెండో రకం పౌరులుగా మార్చేస్తున్నరు.
మన తల మీద వేలాడుతున్న కత్తి
మీరు మా భక్తితో రాజకీయం చేస్తూ.. మా భద్రతతో చెలగాటం ఆడుతున్నరు. ఎన్ఐఏ (NIA) వాళ్లు ప్రతి నెల ఎవరో ఒక ఉగ్రవాదిని పట్టుకుంటానే ఉన్నరు. మొన్న నవంబర్‌లో హైదరాబాద్ డాక్టర్‌ని పట్టుకోలేదా? ఆ డాక్టర్ ‘రిసిన్’ (Ricin) అనే విషంతో కెమికల్ ఎటాక్ చేయాలని ప్లాన్ చేసిండు. ఆ విషం గానీ ప్రయోగిస్తే వేల మంది గాలిలోనే కలిసిపోయేటోళ్లు.
ఒక్కటి ఆలోచించండి.. హైడ్రా (HYDRAA) లెక్కనే ఒకవేళ ఎన్ఐఏ కూడా నిద్రపోతే మన పరిస్థితి ఏంది? ఆ డాక్టర్ తన కుట్రలో నెగ్గి ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయేవి? ఈ సర్కారుకు కేవలం ఒక హాస్పిటల్‌ని కాపాడటం మీద ఉన్న శ్రద్ధ, సామాన్య జనాల ప్రాణాల మీద లేదు. మన ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నిద్రపోతున్నడు. ఎందుకంటే ఆ బాంబులు, ఆ విషం పడేది వాళ్ల ఏరియాల్లో కాదు కదా! అందుకే చట్టం తన పని తాను చేసుకుపోతది అని కబుర్లు చెబుతున్నరు
ఆఖరి దగా: అమ్మవార్ల గుళ్ల మీద బుల్డోజర్లు!
మీకు ఇంకా ఈ సర్కారు మీద నమ్మకం ఉంటే.. ఒక్కసారి పెద్దపల్లి దిక్కు చూడండి. అక్కడ బుల్డోజర్లు పంపిండ్రు.. కానీ దేన్ని కూలగొట్టడానికి? రోడ్డు వెడల్పు పేరుతో వరుసగా ఉన్న మైసమ్మ తల్లి గుళ్లను నేలమట్టం చేసిండ్రు. పదుల సంఖ్యలో ఉన్న మన అమ్మవార్ల గుళ్లను కూల్చేస్తుంటే మీ గుండె కరగలేదా? అదే రోడ్డు మీద ఉన్న దర్గాలను ఒక్కటంటే ఒక్కదాన్ని అయినా ముట్టుకునే దమ్ము మీకు ఉందా? లేదు! కేవలం హిందూ దేవాలయాలే మీకు కనిపిస్తాయా?
బీజేపీ పులిలా గర్జించి, ఒక గోడలా అడ్డుగా నిలబడితే తప్ప.. మీకు సోయి రాలేదు, దిగి వచ్చి మళ్లీ కట్టిస్తామని ఒప్పుకోలేదు. మీకు భక్తి భాష అర్థం కాదు.. మీకు కేవలం అధికారం, గద్ది దించే భయం మాత్రమే అర్థమవుతది. మేము చేతకాని వాళ్లం అని, మా తల్లి గుడిని మేము కాపాడుకోలేం అని మీరు ఇవన్నీ చేసిండ్రు.
తీర్పు
రేవంత్ రెడ్డి గారూ.. కాంగ్రెస్ నాయకులారా.. వినండి! మీ ఈ ఓటు బ్యాంకు రాజకీయం, ఈ పక్షపాతం ఇగ చెల్లవు. మీ ముసుగు తొలగిపోయింది. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి బిడ్డ రక్తం మీ చేతులకు అంటుకుని ఉంది. ఈ రెండేళ్ల మీ పాలనలో రాష్ట్రమంతా అశాంతితో, కడుపు మంటతో రగిలిపోతాంది.
గుర్తుపెట్టుకోండి.. మేము అన్నీ చూస్తున్నాం, అన్నీ లెక్క రాస్తున్నాం. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మా దెబ్బ ఎట్లుంటదో మీకు చూపిస్తాం.
జై శ్రీరామ్!”
