నటుడు ప్రకాష్ రాజ్‌పై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
కఠిన చర్యలకై న్యాయవాది కట్టా శ్రీకాంత్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 17..
హిందూ దేవతలు శ్రీరాముడు, లక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించిన ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ శ్రీరాముడిని, లక్ష్మణుడిని ‘వలస కూలీలు’ అని సంబోధించారని, వారు అడవిలో పండ్లు దొంగిలించారంటూ అపహాస్యం చేశారని న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి కట్టా, ఇఫ్లూ విద్యార్థి సంఘం నాయకుడు పాపిగంటి నరేష్ తమ ఫిర్యాదులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన రామాయణంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని, అలాగే ఆయన ప్రసంగం దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఉందని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన ప్రకాష్ రాజ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS-2023)లోని సెక్షన్ 299, సెక్షన్ 196 కింద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు.

