ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంపై దుష్ప్రచారం సరికాదు: బండి సంజయ్
కరీంనగర్: ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంపై ‘ఎంపవర్డ్ ఇండియన్’ సంస్థ విడుదల చేసిన నివేదిక వాస్తవాలకు విరుద్ధంగా ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని, పరిపాలనాపరమైన ప్రక్రియలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలపై ఆరోపణలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి తనకు కేటాయించిన రూ.17.50 కోట్లలో ఇప్పటికే రూ.16.47 కోట్లు (94.1 శాతం) అభివృద్ధి పనులకు వినియోగించినట్లు బండి సంజయ్ తెలిపారు.
627 పనులకు ప్రతిపాదనలు
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, బోర్వెల్స్ తదితర అభివృద్ధి పనుల కోసం 627 పనులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 82.29 శాతం పనులకు కలెక్టర్ల ఆమోదం లభించిందని తెలిపారు. ప్రతిపాదన నుంచి పనులు పూర్తయ్యే వరకు వివిధ పరిపాలనాపరమైన దశలు ఉంటాయని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నిధుల వినియోగంపై అంచనాలు వేయడం సరికాదని పేర్కొన్నారు.
అంతేకాకుండా, గత ఎంపీ వినియోగించకుండా వదిలేసిన రూ.2.5 కోట్ల నిధులను కూడా ప్రజా అవసరాల కోసం తామే ఖర్చు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు.
నిధులు సరిపోవడం లేదు
స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ లాడ్స్ నిధులు సరిపోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీ లాడ్స్ నిధులను పెంచాలని పలువురు ఎంపీలు కేంద్రాన్ని కోరుతున్నారని చెప్పారు.
అభివృద్ధి పనులు నిధుల కొరతతో నిలిచిపోకూడదనే ఉద్దేశంతో అదనంగా CSR నిధులను సేకరించి ప్రజా అవసరాలకు వినియోగిస్తున్నామని బండి సంజయ్ వివరించారు.
వాస్తవాలను మాత్రమే ప్రజల ముందుంచాలి
‘ఎంపవర్డ్ ఇండియన్’ సంస్థ ఇకనైనా ఎంపీ లాడ్స్ నిధుల విషయంలో ప్రతిపాదన, ఆమోదం, పరిపాలనా ప్రక్రియ, పనుల ప్రారంభం, పూర్తయ్యే వరకు ఉండే దశలను పరిగణనలోకి తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.
ఎంపీలపై అనవసర ఆరోపణలు చేయకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించి వాస్తవ సమాచారాన్ని మాత్రమే ప్రజల ముందుంచాలని ఆయన సూచించారు.
