Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

నక్సలిజం – ఒక విఫల ప్రయత్నం

Praveen Reddy Naredla, 14/05/202514/05/2025
Spread the love
     

దశాబ్దాల కాలంగా భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన భద్రతా సమస్యలు వామపక్ష తీవ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదం. బ్రిటిష్ వారి నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందింది కానీ కొన్ని అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నిరంతరం యుద్ధం చేయాల్సివస్తూనే ఉంది. ఈ దేశంలో 100 సంవత్సరాల క్రితం మొదలై శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న కమ్యూనిజం తమ భావజాల వ్యాప్తిలో ఎన్నో కొత్త పంథాలు- రంగులు మార్చుకుంది. కమ్యూనిజం ఒక కల అది కరిగిన మంచు శిలగా మారింది. 1925 లో భారత దేశంలో ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా.. మాస్కో నేతృత్వంలో పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీని స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశంలో తమ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చింది. 1948లో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పంథాను దేశ వ్యాప్తంగా అమలు పరచాలని ప్రతిజ్ఞ భూని భారత సైన్యంపైనే యుద్ధం ప్రకటించింది. అక్కడితో ఆగకుండా1962లో భారత్ పై చైనా యుద్ధాన్ని ప్రకటించినప్పుడు కమ్యూనిస్టు పార్టీ చైనాని సమర్థించింది.

కమ్యూనిస్టు పార్టీలో మరో కొత్త పంథాతో మావో కమ్యూనిస్టు పేరుతో 1967లో నక్సలైట్లు…అఖిల భారత కమ్యూనిస్టు క్రాంతికారుల సమన్వయ కమిటీ (ఏఐసిసిసిఆర్)ని నిర్వహించి ఆ తర్వాత కాలంలో సిపిఐ (ఎం) నుండి వేరుపడినారు. దేశంలోని అనేక ప్రాంతాలలో తిరుగుబాటు ఉద్యమాలను నిర్వహించి1969 లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్సిస్టు-లెనినిస్టు) భావజాలం పేరుతో శ్రామిక వర్గం,రైతు సమస్యల పరిష్కారమే ద్యేయంగా,సాయుధ పోరాటమే సామాజిక ఆర్థిక అసమానతలకు పరిష్కారమని,వర్గ రహిత సమాజాన్ని సృష్టించడం అనే లక్ష్యంతో వివిధ రాష్ట్రాలలో ప్రధానంగా మధ్య మరియు తూర్పు భారతదేశంలో మొదలై బీహార్, జార్ఖండ్, ఒడిస్సా మరియు ఆంధ్ర తెలంగాణ వంటి రాష్ట్రాలలో గిరిజన తెగలు, అణగారిన వర్గాల పేదలు మరియు గ్రామాలలో ఖాళీగా ఉన్న వారిలో అంతర్గతంగా సామాజిక వ్యవస్థపై ఉన్న ద్వేషాన్ని నక్సలైట్లు తమ భావాజాల వ్యాప్తికి ఉపయోగించుకున్నారు. గత ఐదు దశాబ్దాలుగా నక్సలిజం భారతదేశంలో ఒక నిరంతర అంతర్గత భద్రతా సమస్యగా మారింది. ప్రజాస్వామ్య భారత ప్రభుత్వాన్ని కూలద్రోయాలని వామపక్ష తీవ్రవాదులు హింసను ప్రేరేపిస్తూ, ఆయుధాలను ఉపయోగించి ప్రభుత్వంపై సాయుధ పోరాటం చేస్తున్నారు.

2000 దశకంలో వామపక్ష తీవ్రవాదం, నక్సలైట్లలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. దాంతో అన్ని విప్లవ పార్టీలు తమ లక్ష్యసాధన కోసం ఐక్యతను చాటే విధంగా సరికొత్త పంథాలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిసిస్ట్ లెనినిస్ట్) పీపుల్స్ వార్ గ్రూప్ (పి డబ్ల్యు జి )మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్ ఆఫ్ ఇండియా( ఎం సి పి ఐ) 2004 సెప్టెంబర్ 21న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( మావోయిస్టుగా) ఏర్పడినారు. అత్యాధునిక ఆయుధాలు ఉపయోగిస్తూ, హింసను పెంచుతూ నేపాల్ లోని పశుపతినాథ్ నుండి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి వరకు రెడ్ కారిడార్ (కాంపాక్ట్ ఆపరేషన్ జోన్) విస్తరించాలని చూశారు. కానీ భద్రతా దళాలు చతుర్భుజ వ్యూహాన్ని అనుసరించి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. అందులో ఒకటి సంస్థాగత భద్రతా దళాలు ఉపయోగించాలి.(లోకల్ ఫోర్స్ సి ఆర్ పి ఎఫ్, ఎస్ టి ఎఫ్) 2. వీకేంద్రీకృత అభివృద్ధి( రవాణా, వైద్య, విద్య మరియు సామాజిక అభివృద్ధి) 3. ఆపరేషన్ గ్రీన్ హంట్ (అడవుల్లోని దళాలను ఎదుర్కోవటం)4. ప్రజాస్వామిక పరిష్కారాలపై దృష్టి (రాజకీయాలపై దృష్టి). గడచిన రెండు దశాబ్దాలుగా దాదాపు 14 రాష్ట్రాలలో మావోయిస్టుల ఉనికి కనిపించేది. కానీ ప్రస్తుతం ఛత్తీస్ గఢ్, ఒడిస్సా మహారాష్ట్ర,ఆంధ్ర ప్రాంతాల్లోని దండకారణ్యానికి మాత్రమే పరిమితమైంది.

నక్సల్స్ అణిచివేతకై ప్రభుత్వం చేపట్టిన చర్యలు

వామపక్ష తీవ్రవాద గ్రూపులు ఏకమయ్యాక దాడులు బాగా పెరిగాయి. దీనిని ఎదుర్కొనేందుకు 2005 లో ప్రభుత్వమే స్వయంగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి ఆదివాసి యువకులచే సల్వా జుడుం, రణబీర్ సేన వంటి గ్రూపులను నక్సల్స్ కు వ్యతిరేకంగా పోరాడే విధంగా ఏర్పాటు చేసింది. దీంతో అనేకమంది ఆదివాసి యువకులను ఇటు ప్రభుత్వం అటు మావోయిస్టులు ఇన్ ఫార్మర్స్,కొరియర్స్ పేరిట అంతమొందించారు. 2009లో నాటి ప్రభుత్వం కోబ్రా కమాండ్, బెటాలియన్స్ ఫర్ రెవల్యూషన్ యాక్షన్ బలగాలతో ఆపరేషన్ గ్రీన్ హంట్ కింద మావోయిస్టుల ఏరివేత ప్రారంభించారు. 2017లో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బస్తర్, బీజాపూర్ వంటి దండ కారణ్యాలలో ఆదివాసులతో కలసి మావోయిస్టులు గెరిల్లా దాడులు మొదలుపెట్టారు. దానికి ప్రత్యమాయంగా ఆపరేషన్ సమాధాన్ మొదలుపెట్టి కొంతమేరకు మావోయిస్టుల కార్యకలాపాలని నియంత్రించగలిగింది.

ఇటీవలి కాలంలో మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ బస్తర్ లోని అబూజ్ మడ్ దండకారణ్యంతో పాటు మహారాష్ట్ర గడ్చీరోలి, తెలంగాణ రాష్ట్రాలకు విస్తరించి మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ జనతా సర్కార్ పేరిట తమ కార్యకర్తలు, భద్రత దళాల పై దాడులు ముమ్మరం చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాస్తులను తమ స్వాధీనంలో ఉంచుకోవడంతో పాటుగా ప్రజాప్రతినిధులను, సామాన్య పౌరులను బెదిరించడం మరియు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను అడ్డుకోవడం ఎన్నికలను బహిష్కరించడం వంటి రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపట్టారు. దీనిని ఎదుర్కొని ఆ ప్రాంతాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పెందుకు వేలాదిమంది భారత ప్రభుత్వ భద్రతా దళాలు, స్థానిక పోలీస్ యంత్రాంగం ఎంతో ప్రయత్నం చేస్తున్నది. కానీ మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే కాక రాజ్యాంగబద్ధమైన పౌర సమాజ జీవనానికి ఆటంకం కలిగిస్తున్నారు. దీనిని ఉపేక్షించకుండా కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్ గా మరియు నక్సల్స్ రహిత బస్తరుగా నిర్మిస్తామని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడం అనేది ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం “ఆపరేషన్ కగార్ “ను ప్రవేశపెట్టి ముఖ్యంగా అబూజ్ మడ్ దండకారణ్యంలో తలదాచుకున్న మావోయిస్టులను గుర్తించేందుకు మానవ రహిత విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లను ఉపయోగించడం ఒక శుభ పరిణామం.

తీరు మార్చుకొని నక్సల్స్

నక్సల్స్ ది మొదటి నుంచి దారి తప్పిన సిద్ధాంతమే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామని, దున్నేవాడిదే భూమి అని భారత రాజ్యాంగాన్ని మార్చి శ్రామిక వ్యవస్థను స్థాపిస్తామనడం, వనరుల సమాన విభజన ముఖ్యంగా జమీందారులను, భూస్వాములను నిర్మూలించాలని పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మొద్దని ఎన్నికల ప్రక్రియ ఒక బూటకమని ఎన్నికలను బహిష్కరించాలని సామ్రాజ్యవాదం పెత్తందారు వ్యవస్థని కూలద్రోసి సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థను సృష్టిస్తామంటూ సాయుధ సంఘర్షణకు అమాయక ఆదివాసీ మరియు పేద బడుగు బలహీన వర్గాల యువకులను మానసికంగా సిద్ధం చేసి గెరిల్లా వార్ వైపు నడిపించారు .

అర్బన్ నక్సలైట్లు

అటు పల్లెల్లో, ఇటు అడవులతో పాటు పట్టణ ప్రాంతాల్లో పని పెంచాలని పారిశ్రామిక కార్మికుల సంఘాలలో కార్మిక నాయకులు గా, మీడియా రంగంలో సంపాదకులుగా, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి నాయకులుగా,అధ్యాపకులు, మధ్యతరగతి ఉద్యోగ సంఘాల నాయకులుగా, సామాజిక సంస్థలలో ముఖ్యమైన వ్యక్తులుగా,పౌర సమాజంలో మేధావులుగా చెలామణి అవుతూ నక్సల్స్ భావ జాలాన్ని వ్యాప్తి చేసేవారే అర్బన్ నక్సల్స్.వీరంతా ఒకే సారూప్య దృక్పథం కలిగిన సంస్థల వ్యూహాత్మక ఐక్య ఫ్రంట్ లను నిర్మించుకున్నారు . 2013లో నాగపూర్ లో కార్పెంటర్ గా పనిచేస్తున్న అనుమానిత నక్సల్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేయడం అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో నక్సలైట్ గ్రూపులు పట్టుబడుతున్నాయని అధికారులు గ్రహించారు. 2017లో ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఇటివలనే మరణించిన జి.ఎన్ సాయిబాబా సిపిఐ (మావోయిస్టు) సభ్యుడుగా గుర్తించబడడంతో అతనికి కోర్టు జీవిత ఖైదీ శిక్ష విధించింది. ఆగస్టు 2018లో ఆదివాసీల మానవ హక్కుల కోసం పనిచేస్తున్న పదిమంది ప్రముఖ వ్యక్తులు భారత ప్రధానిని ఎలా అంతమొందించాలి అని మహారాష్ట్రలోని కోరేగాం కుట్ర దారులుగా ఉన్నారు. అరుణ్ ఫెర్రీరా, వెర్నాన్ గొన్సాల్వ్, గౌతమ్ నవలఖా,స్టాన్ స్వామి, వరవరరావు తో సహా అర్బన్ నక్సల్స్, సిపిఐ మావోయిస్టు సభ్యులుగా ఉండటంతో అరెస్టు చేయబడ్డారు. అంతేకాకుండా దేశంలో విద్యాసంస్థలలో విద్యావంతులైన మరియు విద్యార్థి సంస్థలతో అనుబంధంగా ఉన్న విశ్వవిద్యాలయ విద్యార్థుల నియామకాలే లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

ఆర్థిక వనరుల దోపిడీ.. సంఘవిద్రోహ శక్తులతో సంబంధాలు

దశాబ్దాలుగా మావోయిస్టులు ఆధునిక ఆయుధాలు సాంకేతిక పరిజ్ఞానం మరియు తమ కార్యకలాపాల కోసం నిధులను సమకూర్చటంలో ఎంతకైనా తెగిస్తున్నారు. ఎవరితోటైనా కలిసిపోతున్నారు. ప్రతి సంవత్సరం భారత హోం మంత్రిత్వ శాఖ సమాచారం మేరకు సుమారు 2000 కోట్ల ఆర్థిక దోపిడీ చేస్తారని, వీటిని అక్రమంగా బలవంతంగా బెదిరించి వసూలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. రోడ్ల నిర్మాణం, తునికాకు, ఆటవి ఉత్పత్తులు, మైనింగ్ కంపెనీలో పరిశ్రమలు, కార్పొరేట్ల కాంట్రాక్టర్లును బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారనే నెపం మావోయిస్టులపై ఉంది. అంతేకాకుండా నల్లమందు, గసగసాలు సాగు వ్యాపారం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. ఆయుధాలు మరియు బాంబులు వేసే నైపుణ్యా శిక్షణ కోసం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోని ఐఎస్ఐ ఇస్లామిక్ స్టూడెంట్ మూమెంట్ (సిమీ) లష్కరే తోయబా ఎల్టిటి టి, ఉల్ఫా, నేపాల్ మావోయిస్టు వంటి విదేశీ శత్రుదేశాల ఏజెన్సీల సహాయం తీసుకుంటూ, వారి నుండి నిధులు మరియు ఆయుధాలని సమకూర్చుకొని అనేక వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారు.

మావోయిస్టులు భారతదేశానికి అతి పెద్ద ముప్పు

నక్సలిజం భారతదేశం ఎదుర్కొన్న ఏకైక అతిపెద్ద అంతర్గత భద్రతా సవాల్ అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2004లో ఒక సందర్భంలో వెల్లడించారు. మావోయిస్టు ఉద్యమం భారతదేశ అంతర్గత భద్రతా బలహీనతను ఎత్తి చూపుతుంది. దీనివలన భారతదేశము బాహ్య ముప్పులకు కూడా గురవుతుంది. ఒక దేశం లోపలి నుండి అస్థిరంగా ఉంటే బయట నుండి వచ్చే ముప్పులను సమర్థవంతంగా ఎదురుకోలేదు. పాకిస్తాన్ సైన్యంలో 2 అదనపు విభాగాలను ఉచితంగా కలిగి ఉండటం వల్ల భారతదేశం అంతర్గత భద్రత సమస్యలతో బిజీగా ఉందని పాకిస్తాన్ మాజీ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ అభివర్ణించారు.దేశ ఆర్థిక అభివృద్ధికి అంతర్గత భద్రతా (శాంతి భద్రతలు) అత్యంత కీలకం.కాబట్టి ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. దోపిడి ముప్పు కారణంగా బహుళ జాతి సంస్థలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టవు కనుక నక్సలిజాన్ని అరికట్టడానికి భారతదేశం సైన్యం కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. దాని ఫలితంగా సామాజిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది చెదిరిన ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని, చట్టపాలనను కూడా కచ్చితంగా ప్రభావితం చేస్తుంది.

డాక్టర్ రావుల కృష్ణ..

సహాయ ఆచార్యులు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం


Spread the love
     
 
      
News National Telangana

Post navigation

Previous post
Next post

Comment

  1. Meesala Venkatesh says:
    15/05/2025 at 5:11 PM

    ప్రజల సొమ్ము ప్రజలకు చెందాలి అనేవాళ్ళు నక్సల్స్ అవుతారు.వాళ్ళకి యే ఆస్తులు లేవు,మీలాగా ఉద్యోగాలు లేవు,సొంత సంపద లేదు,సౌకర్యాలు లేవు యే చిన్న మంచి జరిగిన అది పేద ప్రజలకి జరగాలని వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారు. మీవి అన్ని ద్వేషంతో కూడిన నిరాధార ఆరోపణలు.మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్నించకూడదు అనే విషపు ఆలోచన . సాయి బాబా నిర్దోషి అని సుప్రీం కోర్టు చెప్పింది మరి మీరు ఏమి రాశారు మీ వ్యాసంలో?ఏక పక్ష మతం కోణంలో చర్చ మీది?
    నేను నక్సలిజం ను సమర్ధించడం లేదు కానీ మీ వ్యాసం మొత్తం వాళ్ళ మీద విషం చిమ్మేళ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.దేశంలో ప్రజాస్వామ్యం వున్నదా?యే ఎన్నిక నిజాయితీగా జరుగుతుంది.మతం పేరుతో గత 10 సంవత్సరాలుగా దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి.దీని గురించి మీరు యెందుకు రాయరు?చర్చలు యెందుకు చేయడం లేదు ప్రభుత్వం నక్సలైట్ల తో?వాళ్ళు అందరూ మా పేద బడుగు బలహీనర్గాలకు చెందిన వాళ్ళే కదా,వాళ్ళు భారతీయులే కదా?ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించడం వేరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం వేరు,భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడటం వేరు?ప్రస్తుతం వున్న ప్రభుత్వానికి వ్యతిరేకం ఐతే దేశానికి వ్యతిరేకం కాదు,ప్రజలకు వ్యతిరేకం కాదు.మీరు ఏమి రాయదలుచుకున్నారు వ్యాసంలో?70 యేండ్ల భారతంలో పిడికెడు మంది లేని నక్సలైట్లు దేశ అభివృద్ధిని ఆపారు అని అంటే పాలించిన ప్రభుత్వాలకు,నేతలకు సిగ్గు శరం లేదు అని అర్దం,నిజాయితీ లేదు అని అర్దం,
    వాళ్ళు ఏమి ఆపారు , హాస్పిటల్స్ ఆపారా?స్కూల్స్ ఆపినర?విశ్వ విద్యాలయాలు ఆపినరా?సంపద పంచడం ఆపినర?రైతుల వ్యవసాయం ఆపినరా ?శ్రామికులపని ఆపినర?
    కొద్ది మంది బడా పెట్టుబడి దారుల దోపిడీ ఆపితే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే అది మీకు దేశ ద్రోహం అవుతుంది,బూటకపు ఎన్కౌంటర్ లో చంపుతారు.ఐనా ఉద్యమం నక్సలిజం పేరుతో ప్రస్తుతం నడుస్తుంది రేపు పేరు మారవచ్చు రూపం మారవచ్చు కానీ ప్రశ్న ఆగడు,ఉద్యమం ఆగదు,పోరాటాలు ఆగవు వాటి రూపం మారుతుంది అంతే.అసలు తమకు వ్యతిరేకంగా మాట్లాడే గళం ,గొంతులు వుండకూడదు అని కోరుకొనే వాళ్ళని,ప్రశ్నించే గొంతులను చట్ట విరుద్ధంగా చంపే వాళ్ళని ఏమనాలి?ద్రోహులు అనాలి,హంతకులు అనాలి.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషనలో కంప్లైంట్ చేసిన శ్రీకాంత్
  • ముదిగంటి జితేందర్ రెడ్డి వర్ధంతి నేడు!!
  • మోడీజీ మన్ కీ బాత్ –Modi ji Mann ki baat
  • 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  • కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా-ఎమోషనల్ లేఖ !!

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer