ఏడిపించేసిన ‘ఇరుముడి’ సినిమా రివ్యూ..
తండ్రి–కూతుళ్ల అనుబంధానికి భావోద్వేగ గీతం!
‘ఇరుముడి’ సినిమా పేరు వినగానే అయ్యప్ప స్వామి నేపథ్యంతో కూడిన కథ అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తే అది కేవలం అయ్యప్ప భక్తి నేపథ్యంలో సాగే కథ మాత్రమే కాదు.. ఆడబిడ్డల భద్రత, తండ్రి ప్రేమ, కుటుంబ బంధాలు, గ్రామీణ వాతావరణం, సామాజిక సమస్యలు అన్నింటినీ కలిపిన ఎమోషనల్ డ్రామా అని అర్థమవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తండ్రి–కూతుళ్ల బంధాన్ని చూసి ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం.

కథ ఏమిటంటే..
త్రినాథరావు పాత్రలో రవితేజకు పెళ్లై నాలుగేళ్లు గడిచినా పిల్లలు పుట్టరు. దీంతో ఊరిలో జనాలు హేళన చేయడం, ఎటకారాలు వేయడం అతడిని బాధిస్తాయి. చివరకు అయ్యప్ప స్వామిని నమ్ముకున్న తర్వాత వారి ఇంట్లో ఓ ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆ పాపే మణెమ్మ.
లేక లేక పుట్టిన బిడ్డ కావడంతో త్రినాథరావుకు ఆమె అంటే ప్రాణం. అదే స్థాయిలో ఆ చిన్నారికి కూడా తన తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. గురుస్వామిగా సాయికుమార్ నటించిన పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుంది.
అయితే త్రినాథరావుకు తాగుడు బాగా అలవాటు. ఆడబిడ్డలను ఎవరైనా ఏడిపించినా, వేధించినా అతడికి పట్టలేని కోపం వస్తుంది. అమ్మాయిలను హరాస్ చేసే వారిపై వెంటనే తిరగబడే మాస్ నేచర్ అతడిది. కానీ భార్య మాత్రం గొడవలంటే భయపడుతుంది.
మాలలో కూల్.. మాల తీస్తే మాస్!
అయ్యప్ప మాల వేసుకున్న 41 రోజులు మాత్రం హీరో పూర్తిగా ప్రశాంతంగా ఉంటాడు. గొడవలకు దూరంగా, భక్తి మార్గంలో నడుస్తాడు. కానీ మాల తీసేస్తే మళ్లీ మాస్ అవతారం ఎత్తుతాడు. తాగుడు, ఫైట్లు, ఆవేశం.. ఇదే అతడి స్వభావం.

ఈ రెండు భిన్నమైన కోణాల్లో హీరో పాత్రను ఆసక్తికరంగా చూపించారు. అయ్యప్ప మాల, భక్తి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమాలోని రెండు అయ్యప్ప పాటలు కూడా చాలా బాగున్నాయి.
పుల్లూరు.. అక్కడి నుంచి అసలు కథ
హీరో ఊరు పేరు పుల్లూరు. ఆ ఊరిలో ఐదో తరగతి వరకు మాత్రమే స్కూల్ ఉంటుంది. ఆ తర్వాత చదువుకోవాలంటే పక్క ఊరికి వెళ్లాల్సిందే. కానీ పుల్లూరు నుంచి పక్క ఊరికి మధ్యలో అమ్మాయిలను వేధించే డ్రగ్స్ బ్యాచ్ ఉంటుంది.
ఇక పుల్లూరు, పక్క ఊరి అమ్మాయిల మధ్య కబడ్డీ పోటీలు జరుగుతుంటాయి. ఎప్పుడూ పుల్లూరు అమ్మాయిలే గెలవడంతో పక్క ఊరి రౌడీ తండ్రి,అతని కొడుకుకు కోపం పెరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న అమ్మాయిలను ఈ రౌడీలు వేధిస్తారు.
ఈ సమయంలో హీరో శబరిమల యాత్రలో ఉంటాడు. జరిగిన విషయాన్ని భార్య, గురుస్వామి హీరోకు చెప్పకుండా దాచిపెడతారు. కానీ తండ్రితో ఏ విషయం దాచని మణెమ్మ మాత్రం మొత్తం విషయం చెప్పేస్తుంది. దీంతో త్రినాథరావు ఆగ్రహంతో ఊగిపోతాడు. అమ్మాయిలను వేధించిన పక్క ఊరి పెద్దమనిషి కొడుకు, అతడి రౌడీ గ్యాంగ్‌ను చితకబాదుతాడు.
కథలోకి చీకటి కోణం..
ఆ తర్వాత గంజాయి తాగే నలుగురు వ్యక్తులు గురుస్వామి కూతురుతో పాటు మరికొంత మంది అమ్మాయిలను వేధిస్తారు. ఈ విషయాన్ని కూడా హీరోకు దాచిపెడతారు. కానీ మళ్లీ తన కూతురు ద్వారా నిజం తెలుసుకున్న త్రినాథరావు వారిని వీరబాదుడు బాదుతాడు.
ఇక్కడి నుంచే అసలు ట్విస్టులు మొదలవుతాయి.
అమ్మాయిలకు చదువు చెప్పే ఓ టీచర్.. స్పెషల్ క్లాసుల పేరుతో చేసే చీకటి బాగోతం కథను ఊహించని మలుపు తిప్పుతుంది. మొదట్లోనే ఆ టీచర్ పెట్టే టార్చర్ కారణంగా ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కథలోని తీవ్రతను మరింత పెంచుతుంది.

బిడ్డ చదువు కోసం తండ్రి త్యాగం
గురుస్వామి విజ్ఞప్తి మేరకు అక్కడి ఎమ్మెల్యే పక్క ఊరికి బస్సు సౌకర్యం కల్పిస్తాడు. హీరో కూతురు ఐదో తరగతి పాస్ అయిన సందర్భంగా ఊరంతా పిలిచి భోజనాలు పెట్టేంత ప్రేమను చూపిస్తాడు తండ్రి.బిడ్డ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడడు..అవసరమైతే ఉన్న పొలం అంతా అమ్ముతా అని భార్యతో కూడా గొడవ పడేంత ప్రేమ బిడ్డపై ఉంటుంది..తండ్రి,బిడ్డల అనుబంధం మనసుకు హత్తుకునేలా అనిపిస్తుంది.
కానీ ఉన్నత చదువుల కోసం కూతురు పక్క ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆమెను అక్కడికి పంపడం త్రినాథరావుకు అసలు ఇష్టం ఉండదు. భార్య, గురుస్వామి ప్రోత్సాహంతో చివరకు కూతురి భవిష్యత్తు కోసం ఒప్పుకుంటాడు.
ఇక్కడి నుంచి సినిమా పూర్తిగా సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది.
మాల వేయబోతున్న హీరో.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న శత్రువులు!
హీరో మళ్లీ అయ్యప్ప మాల వేసే సమయం వస్తుంది. మాల వేసే ముందు రెండు రోజులు ఫుల్‌గా తాగుతుంటాడు. హీరో మాల వేసుకుంటే 41 రోజులు ఎలాంటి గొడవలకు దిగడని తెలిసిన గంజాయి బ్యాచ్, పక్క ఊరి పెద్దమనిషి కొడుకు అతడిపై దాడికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు.
అటు హీరో భార్య, గురుస్వామి మాత్రం అమ్మాయిల పరిస్థితిపై ఆందోళన చెందుతుంటారు. రౌడీలందరికీ అల్టిమేటం ఇచ్చిన హీరో.. తర్వాత శరణం చెప్పడంతో అందరినీ వదిలేస్తాడు.
కానీ పక్క ఊరి పెద్దమనిషి కొడుకు మాత్రం రాడు.
ఆవేశంలో ఉన్న హీరో రాత్రి కత్తి పట్టుకొని అతడిని చంపడానికి బయలుదేరతాడు. కానీ తెల్లారేసరికి ఆ వ్యక్తి శవమై కనిపిస్తాడు. దీంతో హీరోపై హత్య ఆరోపణలు వస్తాయి. “నేను చంపలేదు” అని హీరో చెబుతున్నా.. పక్క ఊరి పెద్దమనిషి మాత్రం అతడిపై శత్రుత్వాన్ని మరింత పెంచుకుంటాడు.
అసలు ట్విస్టులు ఇక్కడే..
తన కూతురు కోసం మందు మానేస్తానని హీరో మాట ఇస్తాడు. మాల వేయాలంటే ఇక తాగొద్దని బిడ్డ పెట్టిన కండిషన్ కోసం తండ్రి తన అలవాటును వదులుకుంటాడు. కానీ హీరోపై వరుస దాడులు జరుగుతుంటాయి.
ఇక టీచర్ స్పెషల్ క్లాసుల వెనుక ఉన్న అసలు చీకటి కోణం ఏమిటి?
హీరో కూతురి హత్య వెనుక ఎవరు ఉన్నారు?
గురుస్వామిని ఎందుకు చంపారు?
ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పాత్ర ఏమిటి?
అమ్మాయిలను వేధిస్తున్న వారిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు?
అనే ప్రశ్నలకు సమాధానాలే సెకండాఫ్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.
క్లైమాక్స్ మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంది..
సినిమాలో అతిపెద్ద బలం తండ్రి–కూతుళ్ల బంధం. తన బిడ్డ అంటే ప్రాణంగా చూసుకునే తండ్రి.. ఆమె చివరి అంత్యక్రియల సమయంలో పడే వేదన ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది.
కూతురిని ప్రాణంగా ప్రేమించిన తండ్రి బాధను దర్శకుడు చాలా హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు. ముఖ్యంగా చివర్లో కన్నె అయ్యప్ప స్వామిలో తన బిడ్డను చూసుకునే హీరో, బిడ్డ చెప్పిన డైలాగులతో కలిసే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి.
ఎవరి నటన ఎలా ఉంది?
రవితేజ తండ్రి పాత్రలో వేరే లెవల్‌లో నటించాడు. మాస్, ఆవేశం, ప్రేమ, బాధ.. ముఖ్యంగా తండ్రిగా అతడి ఎమోషనల్ నటన సినిమాకు ప్రధాన బలం.
హీరోయిన్ నటన కూడా కథకు తగ్గట్టుగా ఉంది. గొడవలంటే భయపడే భార్య పాత్రలో ఆమె భావోద్వేగాలను బాగా పండించింది.
సాయికుమార్ గురుస్వామిగా తన అనుభవాన్ని మరోసారి చూపించాడు. కథలో ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది.
ప్లస్ పాయింట్స్
- తండ్రి–కూతుళ్ల అనుబంధం
- ఆడబిడ్డల భద్రతపై బలమైన కథనం
- అయ్యప్ప స్వామి నేపథ్యం
- గ్రామీణ వాతావరణం
- సెకండాఫ్ ట్విస్టులు
- రవితేజ నటన
- గురుస్వామిగా సాయికుమార్ పాత్ర
- స్క్రీన్‌ప్లే, డైలాగులు
- ఎమోషనల్ క్లైమాక్స్
- అయ్యప్ప పాటలు
మైనస్
ఫస్ట్ హాఫ్‌లో కథ కొంత స్లోగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు ఇంకాస్త వేగంగా నడిపి ఉంటే మరింత బాగుండేది. అయితే సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ఈ లోటును చాలా వరకు భర్తీ చేస్తాయి.
ఫైనల్‌గా..
‘ఇరుముడి’ ఒక సాధారణ మాస్ సినిమా కాదు.. ఆడబిడ్డలపై జరుగుతున్న వేధింపులు, డ్రగ్స్ ప్రభావం, విద్య పేరుతో జరిగే చీకటి కోణాలు, తండ్రి ప్రేమ, అయ్యప్ప భక్తి.. అన్నింటినీ కలిపిన ఎమోషనల్ డ్రామా.
ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా ఉన్నా.. సెకండాఫ్, ట్విస్టులు, క్లైమాక్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా తండ్రి–కూతుళ్ల అనుబంధం కోసం, రవితేజ నటన కోసం ఈ సినిమా తప్పక చూడొచ్చు.
మొత్తంగా: ‘ఇరుముడి’ – కంటతడి పెట్టించే తండ్రి ప్రేమ కథ.. ఆడబిడ్డల కోసం పోరాడే ఓ అయ్యప్ప భక్తుడి భావోద్వేగ ప్రయాణం!
రవితేజ ఇటీవల వచ్చిన సినిమాలు ఇవి:
- ఇరుముడి (Irumudi) –నిన్న 21 ఆగస్టు 2026 తాజాగా విడుదలైంది..సూపర్ హిట్
- భర్త మహాశయులకు విజ్ఞప్తి – 13 జనవరి 2026
- మాస్ జాతర (Mass Jathara) – 31 అక్టోబర్ 2025
- మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) – 15 ఆగస్టు 2024
- ఈగల్ (Eagle) – 9 ఫిబ్రవరి 2024 అన్ని ప్లాఫ్ టాక్
ప్రస్తుతం లేటెస్ట్ మూవీ మాత్రం “ఇరుముడి”. రవితేజ–శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.
