2రోజుల నిరాహార దీక్ష చేపట్టనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉద్యమబాట పట్టింది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ “ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి” అనే పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రాంచందర్ రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

ఇప్పటికే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గత నెలలో “ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి” అనే ఉద్యమ నినాదంతో రాష్ట్రంలోని అన్ని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను కలిసి సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటికే 5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించారు. అదే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రూ.8 వేల కోట్లు పెండింగ్ పెట్టగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.7 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టిందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఈ విషయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీకి వెళ్లాలంటే సర్టిఫికెట్లు తప్పనిసరి. కానీ ప్రభుత్వం బకాయిలు విడుదల చేయని కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. కట్టలేని నిరుపేద విద్యార్థులు పై చదువులకు దూరం అవుతున్నారు. అలాగే ఉద్యోగాల్లో చేరే విద్యార్థులకు కూడా ఈ పరిస్థితి రావడం వల్ల ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడుతున్నారు.ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఉద్యమిస్తున్నా కూడా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
ఈ స్థితిలో బీజేవైఎం విద్యార్థుల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లా కేంద్రంలో వేలాది మంది విద్యార్థులతో స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.మొన్న కరీంనగర్ లో బీజేపీ,బీజేవైఎం చేపట్టిన నిరసన కార్యక్రమంలో వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘాటుగా విమర్శించారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాల్సింది పోయి నిరసనల్లో, ధర్నాల్లో, ర్యాలీల్లో విద్యార్థులను పాల్గొనవద్దని, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను పంపవద్దని బెదిరిస్తూ సీపీ స్థాయిలో యాజమాన్యాలకు, ప్రిన్సిపాళ్లకు సర్క్యులర్లు జారీ చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో పోలీసుల ఆంక్షలతో ఉద్యమాలను అణచలేరని, శక్తి స్కీమ్‌తో పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా నరకయాతన పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.

అదే విధంగా గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా విద్యార్థులను మోసం చేసిందని, వారు కూడా రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టి తెలంగాణ విద్యార్థులను వంచించారని బీజేపీ ఆరోపిస్తోంది. అందువల్లే వారికి మొఖం లేక నోరెత్తడం లేదని విమర్శించింది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు 48 గంటల నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఈ నెల 24, 25 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన నిరాహార దీక్షకు దిగనున్నారు.
బీజేపీ, బీజేవైఎం నేతలు వేల సంఖ్యలో విద్యార్థులను చైతన్యం చేసి ఈ నిరాహార దీక్షలో పాల్గొనేలా చేస్తారని తెలుస్తోంది.
40 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా చేపడుతున్న ఈ నిరాహార దీక్ష తప్పకుండా ప్రభావం చూపేలా ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.









