అమెరికా వేదికగా తెలంగాణపై బీజేపీ గురి.. అధికారమే లక్ష్యమన్న రాంచందర్‌రావు

ప్రవాస భారతీయుల సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు
న్యూజెర్సీ, ఆగస్టు 4: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
అమెరికాలోని న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్ హాల్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (USA of BJP) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదుగుతోందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎన్డీఏ ప్రభుత్వం విశేష పురోగతి సాధించిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో 75 విమానాశ్రయాలు ఉండగా, ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో వాటి సంఖ్య 150కి పెరిగిందని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలన రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని రాంచందర్‌రావు విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఈ పరిస్థితిని బీజేపీకి అనుకూలంగా మార్చుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలిపారు.
రానున్న జీహెచ్‌ఎంసీ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, కీలక నిర్ణయాల ప్రస్తావన
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్ధి, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి సాధించిందని రాంచందర్‌రావు అన్నారు.
డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వందే భారత్ రైళ్లు, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ వంటి పథకాలు దేశ అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.
అలాగే ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు.
రాంచందర్‌రావుపై ప్రశంసలు
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కోశాధికారి డి. వాసుదేవరావు మాట్లాడుతూ రాంచందర్‌రావు నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు.
USA of BJP మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల, USA of BJP తెలంగాణ కన్వీనర్ విలాస్‌రెడ్డి జంబులా తదితరులు మాట్లాడుతూ అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దేశభక్తి, జాతీయవాద భావజాలంతో బీజేపీకి అండగా నిలుస్తున్నారని తెలిపారు.

భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రవాస భారతీయులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారని అన్నారు.
వందలాది మంది ప్రవాస భారతీయుల హాజరు
ఈ కార్యక్రమంలో అమర్ గోస్వామి, శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, విజయ్ కుందూర్, ప్రవీణ్ తడకమల్ల, మధు బెల్లం, రామ్ వేముల, సాయినాథ్ (దసరా), బస్వ శేఖర్, హనుమంత్, రవి పటేల్, సుబ్రమణ్యం, కల్పనా శుక్లా, అమిత్ పాండే, గుంజన్ మిశ్రా, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, పీయుష్ పటేల్, సుమన్ రాయ్, ఉపేంద్ర చివుకుల, రాజు రెడ్డి, సురేష్ పటేల్, శ్రీనివాస్, ప్రదీప్ కట్ట తదితరులు పాల్గొన్నారు.

అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి వందలాది మంది ప్రవాస భారతీయులు, బీజేపీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు కార్యక్రమానికి హాజరై ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి తమ మద్దతు ప్రకటించారు.
వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో తాము కూడా భాగస్వాములమవుతామని ప్రవాస భారతీయులు పేర్కొన్నారు.
కార్యక్రమం ముగింపులో అతిథులను ప్రవాస భారతీయులు ఘనంగా సన్మానించారు.

